ఛత్రపతి శివాజీ అమ్మవారికి భక్తుడు. అలాగే భారతీయుల హృదయాలలో గొప్ప దేశభక్తుడుగా
మాతృదేశ సంరక్షకుడిగా గుర్తింపు పొందిన వాడు. ధర్మ రక్షకుడు.
అతడు తన ఏలుబడిలో వున్న ప్రజలపై ఎప్పుడూ అధిక పన్నులు వేయలేదు. తను ఎంత నియమబద్ధంగా వుండే వాడంటే తన పట్టాభిషేకానికి కూడా సొంత ధనాన్ని మాత్రమే వినియోగించాడు కానీ ఖజానా లోని ప్రజల సొమ్మును ముట్టలేదు.
శివాజీ నివసించే రాయగఢ్ కోట శత్రువులకు దుర్భేద్యంగా, అత్యంత కట్టుదిట్టంగా ఉండేది. ఛత్రపతి శివాజీ ఆజ్ఞ మేరకు ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు కోట తలుపులు తీయడం, తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు కోట తలుపులు మూసివేయడం జరిగేది.
రాజ్య రక్షణార్థం ఇటువంటి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడేది కాదు.
ద్వారం మూసి ఉండే సమయంలో చీమకూడా కోట లోపల్నుండి బయటికి గానీ బయటి నుండి లోపలకు గానీ వెళ్లేది కాదు. అంతటి పటిష్టమైన పహారా వుండేది.
హీరాకానీ అనే యాదవ స్త్రీ ఒకామె పాలు అమ్ముకుని జీవించేది. ఆమె ప్రతి రోజూ తన ఊరినుండి కోటలోకి వచ్చి అక్కడి సైనికులకు అధికారులకు పాలుపోసి తిరిగి తన ఊరికి వెళ్లిపోయేది. ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే తనకు చేతనైన సహాయం చేసేది.
ఇలా ఉండగా, ఆమె ఒక రోజు సాయంకాలం కోటలోకి పాలుపోయటానికి వచ్చింది. అదే సమయానికి ఆమె పాలు పోసే ఇంట్లో ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతుండటం చూసింది. పురుడు అయ్యేవరకూ అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. ఇంటికి వెళదామని చూస్తే సమయం తొమ్మిది దాటిపోయింది.
కోట గుమ్మం మూసేస్తారని గుర్తుకొచ్చి పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.
అప్పటికే తలుపులు మూసేసారు. ఆమె మంచితనం పట్ల కావలి వాళ్లకు అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించ లేక తలుపులు తీయలేదు.
“అయ్యోఁ ! ఇంట్లో పసిపిల్లవాడిని వదలి వచ్చాను. వాడికి ఆకలివేస్తుంది, పాలివ్వాలి బాబూ ! వాడలలో ఆకలికి తట్టుకోలేడు” అని సైనికులను ప్రాధేయపడింది.
హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు…
“తల్లీ ! మేము రాజాజ్ఞను మీరలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలు పడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం ఆరవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊరడించారు.
మర్నాడు తెల్లవారుతానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.
కంగారుపడిన కావలివాళ్ళు శివాజీ మహారాజుకి ఈ విషయం తెలియజేసారు.
“ఒక స్త్రీ అభేద్యమైన కోటను అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా !? అది ఎలా సాధ్యం ?!” అని ఆశ్చర్యపోతూ…
స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ. ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. ద్వారం వద్ద శివాజీ మహారాజును చూసి వణుకుతూ చేతులు జోడించి నిలబడి…
“అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడను ఎలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని వేడుకుంది.
అది వినగానే, అరివీర భయంకరుడు శత్రువులకు సింహస్వప్నము అయిన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చూస్తుండగా హీరాకానీకి సాష్టాంగ నమస్కారం చేశాడు.
“అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువ లేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇకనుంచీ ఇక్కడి బురుజును హీరాకానీ బురుజుగా పిలుస్తారు” అని ఆమెను పంపేశాడు తల్లి విలువ తెలిసిన శివాజీ.
రాయగఢ్ కోటలో ఇప్పటికీ ఈ బురుజును హీరాకానీబురుజు గానే పిలవబడుతోంది. మీరు ఎప్పుడైనా ఈ కోటను దర్శిస్తే ఈ బురుజును తప్పక చూడండి.