తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి నిర్మలమ్మ.సినీనటి నిర్మలమ్మ అసలు పేరు రాజమణి.ఈరోజు ఆమె వర్థంతి సందర్భంగా వారికి నివాళులు.
జననం 1929
మరణం 19 ఫిబ్రవరి 2009
నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.
నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. స్వస్థలం కృష్ణా జిల్లా బందరు. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించాడు.
నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావుతో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.
షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు
కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది.
ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
నిర్మలమ్మ ఆడపెత్తనంలో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.
నిర్మలమ్మ కొంతకాలం అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి హైదరాబాదులో 19 ఫిబ్రవరి, 2009 రోజున మృతిచెందారు.
బందరు బామ్మ…నిర్మలమ్మ!
Related tags :