వాళ్లెవ్వరూ ఎంబీయేలు చదివి వ్యాపార పాఠాలు నేర్చుకున్నవాళ్లు కాదు ఆమాటకొస్తే వాళ్ల అక్షరజ్ఞానం అంతంత మాత్రమే! అయినా వాళ్లు సాధించిన విజయం గురించి వింటే ఎవరైనా శెభాష్ అనకమానరు. విశాఖకు చెందిన ఈ మత్స్యకార మహిళలు సంఘటితంగా సాధించిన సొసైటీ ఆస్తుల విలువ రూ.150కోట్ల పైమాటే. గంగమ్మ తల్లినే నమ్ముకుని బతికే మత్స్యకార మహిళలు వాళ్లంతా. తెల్లవారకముందే చేపలరేవుకెళ్లి చేపలు కొనుగోలు చేసి వాటిని ఎండబెట్టి ఆ ఉప్పుచేపల్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నడిచే వారపు సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. విశాఖలో చేపల రేవు నిర్మించక ముందు నుంచి వాళ్ల వృత్తి అదే. అయితే అందరిదీ ఒకటే కట్టుబాటైతే బాగుంటుందన్న ఆలోచనతో నలభై సంవత్సరాల క్రితం ‘ది విశాఖపట్నం టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రైఫిష్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ పేరుతో సొసైటీని ఏర్పరచుకున్నారు. మధ్యలో వారి వ్యాపారానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయినా వారికున్న పోరాటపటిమతో ఆ ఆటంకాలను దాటుకొచ్చారు. ప్రస్తుతం ఈ సొసైటీలో 164 మంది సభ్యులున్నారు. కుటుంబ సభ్యులతో కలిపి వీళ్లంతా సుమారు రెండువేల మంది వరకూ ఉంటారు. వీళ్లలో ఎవరు మరణించినా రూ.10వేల ఆర్థికసాయం సొసైటీ తరఫున అందుతుంది. సొసైటీలో సభ్యురాలు వారి కుటుంబం నుంచి మరొకరికి ఆ సభ్యత్వం అందుతుంది. సొసైటీ నిధుల నుంచి సభ్యులకు ఏటా రూ.10 లక్షల వరకూ రుణం అందుతుంది. వారిచ్చే వడ్డీని సొసైటీ అవసరాలకు వినియోగించుకుంటారు. అయితే ఈ అప్పుని ఏడాదిలోపు తిరిగి తీర్చేయాలి. ప్రతి సభ్యురాలికి గరిష్టంగా రూ.50వేల వరకూ అందుతుంది. ప్రతి సంవత్సరం వేటపై రెండునెలలపాటు నిషేధం విధించినప్పుడు మత్స్యకారులకు ఉపాధి ఉండదు. అలాంటి సమయంలో సొసైటీ నిధుల నుంచి ప్రతి సభ్యుడికి పాతిక కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ కందిపప్పు, రూ.500 నగదు అందుతుంది. సొసైటీ నిధుల నుంచి రూ.60లక్షలను కేటాయించుకుని ఓ చక్కని కల్యాణమండపాన్ని, దేవాలయాన్ని నిర్మించుకున్నారు. అవి మాత్రమే కాదు పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఉద్యానవనం, ఆఫీసు కూడా ఏర్పాటుచేసుకున్నారు. వాళ్ల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించుకున్నారు. సొసైటీ సభ్యులు చేపల విక్రయాల కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు సరకును మోసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రెండు లారీలు కొనుగోలు చేశారు. సరకును అందులో లోడ్ చేసి సంతకు పంపించేస్తారు. ఫలితంగా వాటిని మోయాల్సిన బాధ ఉండడంలేదు. చేపలు ఎండబెట్టుకునే ప్రదేశంలో మౌలిక వసతులు ఏర్పాటుచేయడానికి చేసిన కృషి కూడా ఫలించడంతో రూ.1.62కోట్లు మంజూరైంది. ఆమొత్తంతో 60 ప్లాట్‌ఫారాలు, సరకు నిల్వ గోదాములు తదితరాల నిర్మాణం జరుగుతోంది. సొసైటీ సభ్యులందరూ తమ పిల్లల్ని బాగా చదివించుకోవడానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పలువురు మహిళల పిల్లలు ఇంజినీర్లుగా, కొద్దిమంది డాక్టర్లుగా, ఆడిటర్లుగా కూడా స్థిరపడ్డారు. డిగ్రీ వరకు చదివినవారికి లెక్కేలేదు. స్థానికంగా ఉండే వారు చదువుకుంటూనే చేపలవ్యాపారంలో తల్లులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. మారుపిల్లి పార్వతమ్మ సొసైటీ అధ్యక్షురాలిగా గత ఐదేళ్లుగా కొనసాగుతున్నారు.
₹150కోట్లు సమీకరించిన విశాఖ మత్స్యకార మహిళలు
Related tags :