ప్రపంచంలోనే ప్రముఖ తెలుగు సంఘంగా పేరు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో జరుగుతున్న ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్థానాలకు ఈ సారి అభ్యర్ధులు బరిలోకి దిగారు. కొడాలి నరేన్, శృంగవరపు నిరంజన్, గోగినేని శ్రీనివాసలు అధ్యక్ష పదవికి నామినేషన్లు వేశారు. నరేన్, నిరంజన్ వర్గాల తరపున అన్ని స్థానాలకు పందెం కోళ్లను బరిలోకి దించారు.
*** పగలు పురివిప్పుతున్నాయిగా
పోటీలో ఉన్న ఇరు వర్గాల వారు ఇప్పుడిప్పుడే తమ కత్తులకు పదును పెట్టుకుంటున్నారు. అందరూ ఊహించినట్లుగానే నామినేషన్ల పర్వం ముగియక ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కార్యదర్శులుగా నిరంజన్ వర్గం నుండి వేమూరి సతీష్, కొడాలి నరేన్ వర్గం నుండి భల్లా భక్తా రంగంలోకి దిగారు. తొలి ఆరోపణల యుద్ధం వీరిద్దరిపైనే జరుగుతోంది. భక్తా భల్లా 2023 వరకు నాలుగేళ్ళపాటు కొనసాగే విధంగా ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. రెండేళ్ళ ముందుగా ఆయన తన పదవికి సకాలంలో రాజీనామా చేయకుండా నామినేషన్ వేశారనేది నిరంజన్ వర్గం ఆరోపణ. 13వ తేదీన నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన రాజీనామా అందలేదని సాంకేతికంగా ఇది చెల్లదని నిరంజన్ వర్గం అభ్యంతరం పెడుతోంది. తాను సకాలంలోనే రాజీనామా సమర్పించానని అది ఎన్నికల అధికారులకు సకాలంలో అందకపోవడం తన తప్పిదం కాదని భక్తా భల్లా ప్రకటించారు. బోర్డ్ తమ చేతులలో ఉన్నదని ఇష్టం వచినట్లు ప్రవర్తిస్తే తానా సభ్యుల నుండి నిరసనలు ఎదుర్కోక తప్పదని ఆయన అల్టిమేటం ఇస్తున్నారు. నిరంజన్ వర్గం తరపున కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న వేమూరి సతీష్ చరిత్రను కొడాలి నరేన్-వేమన సతీష్ వర్గం బయటకి లాగింది. ఇప్పటి వరకు కొడాలి నరేన్-వేమన సతీష్‌లకు సన్నిహితుడుగా ఉన్న వేమూరి సతీష్ ఈ ఎన్నికల్లో తన బిగ్ బాస్ కోమటి జయరాంకు నామాలు పెట్టి నిరంజన్ వర్గంలోకి దూకారు. 2019లో వాషింగ్టన్ డీసీలో తానా మహాసభలు జరుగుతున్న సమయంలోనే ఇమ్మిగ్రేషన్ అక్రమాల కేసులో నకిలీ పత్రాలు సమర్పించారంటూ వేమూరి సతీష్‌ను అమెరికా పోలీసులు జైలులో వేశారు. ఆ రోజున వేమూరి సతీష్ చాలా మంచివాడని, ఆయన తప్పు చేయలేదని, మహాసభల్లో ప్రత్యక్షంగా ఆయనతో కలిసి తిరిగి సమర్థించిన వేమన సతీష్ వర్గం ప్రస్థుతం ప్లేట్ మార్చింది. క్రిమినల్ స్వభావం ఉన్న వేమూరి సతీష్‌ను కార్యదర్శి పదవికి ఎలా పోటీ చేయిస్తారని నరేన్ వర్గం తూటాలు పేల్చుతోంది. ప్రస్తుత తానా కార్యవర్గంలో వేమూరి సతీష్ కోశాధికారిగా కొనసాగుతూ ఉండటం గమనార్హం.
*** చిరునామాల గోల
ప్రస్తుత అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కాబోయే అధ్యక్షుడు అంజయ్య చౌదరిలు వేలాదిగా తానాలో భోగస్ సభ్యత్వలు చేర్పించారని, వారి చిరునామాలు కూడా తప్పుగా నమోదు చేశారని, ఒకే చిరునామాలో 50, 60 ఓటర్లను చూపిస్తున్నారని, దీనిపై విచారణ జరగాలని నరేన్ వర్గం పట్టుబడుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరగాలంటోంది.
*** SR Nagar పోలీస్ స్టేషన్‌లో కేసులు
నిరంజన్ వర్గం తరపున కోశాధికారిగా పోటీ చేస్తున్న కొల్లా అశోక్ బాబుపై కొడాలి నరేన్ వర్గం కత్తులు నూరుతోంది. తమ వర్గానికి పెద్ద దిక్కుగా ఉండే కోమటి జయరాంకు నామాలు పెట్టి నిరంజన్ వర్గంలోకి అశోక్ ఫిరాయించడం పట్ల కొడాలి నరేన్-వేమన సతీష్ వర్గం మండిపడుతోంది. దాదాపు ఒక ఏడాది క్రితమే హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో కొల్లా అశోక్ మీద ఓ వర్గం క్రిమినల్ కేస్ నమోదు చేయించింది. అమెరికాలో అశోక్ దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తి బ్యాగ్ నుండి $3000 డాలర్లు మాయం అయ్యాయని, ఉపాధి చూపిస్తానని అమెరికాకు తీసుకువెళ్ళి అతన్ని మోసగించాడని కొల్లా అశొక్ పైన కేసు నమోదయ్యింది. మొత్తం మీద ఈ కేసులో ఆధారాలు లేనందున పోలీసులు ఆ కేసును ముగించారు. నిరంజన్ వర్గంలో కీలకవ్యక్తిగా ఉంటూ ఎత్తులు, జిత్తులు వేయడంలో ఆరితేరిన కొల్లా అశోక్‌ను ఈసారి మట్టి కరిపించాలని నరేన్-సతీష్ వర్గం భారీగానే ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.
*** ఈసారి ఎన్నికల్లో వింతలు విశేషాలు విడ్డూరాలు…ఎన్నొ ఎన్నెన్నో!
ఈ సారి జరుగుతున్న తానా ఎన్నికల్లో చాలా వింతలు, విశేషాలు, చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి బాహాటంగానే నిరంజన్ వర్గం తరపున ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, నాదెళ్ళ గంగాధర్, వేమన సతీష్‌లు కొడాలి నరేన్ వర్గానికి బహిరంగ మద్దతు ఇస్తున్నారు. తానాలో ఇప్పటి వరకు చక్రం తిప్పిన కోమటి, నాదెళ్ళ, వేమనల నాయకత్వాన్ని దెబ్బకొట్టాలని, తానాకు వారిని దూరంగా ఉంచాలని తానా ప్రస్తుత అధ్యక్షుడు తాళ్ళూరి, కాబోయే అధ్యక్షుడు అంజయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు సామ, దాన, భేద, దండోపాయాలతో తానాలో తమ పబ్బం గడుపుకున్న కోమటి జయరాం, నాదెళ్ళ గంగధర్, వేమన సతీష్‌లు ఈ ఎన్నికల్లో ఆత్మరక్షణలో పడిపోయారు. ఇప్పటికైనా ఈ ముగ్గురూ తమ పంతాలను పక్కన పెట్టి రాజీకి వస్తే కొంతవరకైనా వీరి గౌరవం నిలబడుతుందని తానాలో ఉన్న మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. తానా ఎన్నికల్లో ఇరువర్గాలు రాజీ పడకుండా, హుందాగా వ్యవహరించకుండా తమ పద్ధతులను కొనసాగిస్తే తానా చరిత్ర “కుక్కలు చింపిన విస్తరిలాగా” అవుతుందని తానా పెద్దలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్