NRI-NRT

తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుదాం-వెంకయ్య

Venkaiah Naidu Participates In Mother Language Day by TANA

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సంధర్భంగా, ఫిబ్రవరి 21 న తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “తల్లి భాష తెలుగు మన శ్వాస” అనే అంతర్జాల కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుదాం – ఉపరాష్ట్రపతి
• విదేశాల్లో ఉన్న తెలుగు వారు, మన సాహిత్యాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించే ప్రయత్నం చేయాలి
• తెలుగు కావ్యాల గురించి ఈతరం పిల్లలకు అవగాహన పెరిగే విధంగా పుస్తకాలు రావాలి
• భాషను సాంకేతికతతో అనుసంధానం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి
• తెలుగు భాష, సంస్కృతులను భావి ప్రవాసాంధ్రులకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయం

తెలుగు సాహితీ వైభవాన్ని, సంస్కృతిని ప్రపంచ వేదికపై ఘనంగా చాటేందుకు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించే ప్రయత్నం చేయాలని వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఆయన, ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదం అయినంతగా, మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాలతో పాటు, తెలుగు వారంతా చొరవ తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.

గత 44 సంవత్సరాలుగా ఉత్తర అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం పాటు పడుతూ, వాటిని ప్రవాసాంధ్ర భావితరానికి అందించే క్రమంలో ఆహరహం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి, తానా ప్రపంచ సాహితీ వేదిక ద్వారా ప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న, సాహిత్య వేదిక నిర్వాహకులు, తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
విశ్వంలోని విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని, మాతృభాషల వైభవాన్ని ఘనంగా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” గా ప్రకటించిందన్న ఉపరాష్ట్రపతి, ఎన్నో భాషలు అంతరించే దశలో ఉన్నాయని, ప్రస్తుతం చాలా మంది తెలుగు వారు తమ భాషను మాట్లాడలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో 30 ఏళ్ళ తర్వాత భాష పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితి మారాలంటే మొదట ప్రాథమిక విద్యాభ్యాసం, పరిపాలన భాష, న్యాయస్థానాల భాష, శాస్త్ర సాంకేతిక విద్య మాతృభాషలోకి మారాలని, అన్నింటికీ మించి కుటుంబ సభ్యులతో మాతృభాషలో మాట్లాడుకోవాలని సూచించారు. మొదటి మార్పు ప్రజలతో మొదలు కావాలని ఆకాంక్షించారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందే క్రమంలో, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పొరపాటు మాతృభాషను విస్మరించడమన్న ఉపరాష్ట్రపతి, భాషా పరిరక్షణ, భాషా వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగు వారు, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు నడుం బిగించాలని సూచించారు. తెలుగు వారికి పద్యం, సామెతలు వంటి విశేషమైన భాషా సంపద ఉందని, తెలుగు పంచ మహా కావ్యాలను ముందు తరాలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో అందించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచమంతా అంతర్జాలంతో కలిసి పరిగెడుతోందన్న ఉపరాష్ట్రపతి, భాషను, సాంకేతికతతో అనుసంధానించే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని, ఈ దిశగా భాషావేత్తలు, భాషాభిమానులు, సాంకేతిక నిపుణులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లో తెలుగు భాష వాడకం, లిపి సృష్టి లాంటి విషయాల్లో చెప్పుకోదగిన కృషి జరిగిందని, ఈ మార్గంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల దిశగా సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తానా పూర్వ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, తానా అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్, ప్రసిద్ధ కవి డా. అద్దంకి శ్రీనివాస్, అవధాని గన్నవరం లలిత ఆదిత్య, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, కడప స్వాతి, విష్ణుభట్ల కార్తీక్, అద్దంకి వనీజతో పాటు పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు.

ఈ క్రింది పేర్కొన్న అతిధులు వివిధ అంశాలపై ప్రసంగించారు:
డా. ఈమని శివనాగిరెడ్డి – స్థపతి, చరిత్రపరిశోధకులు, బహుగ్రంధ రచయిత, విజయవాడ కల్చరల్ సెంటర్ కార్య నిర్వహణాధికారి – ‘తెలుగు భాష పరిణామక్రమం – శిలాశాసనాల సాక్షిగా’, అనే అంశంపై, ఆచార్య శ్రీ గణేష్ తొట్టెంపూడి – భాషాశాస్త్ర, సాంకేతిక నిపుణులు, ఎస్. ఆర్. హెచ్ విశ్వవిద్యాలయం, జర్మని – ‘జర్మనీ దేశంలో ప్రజలు వారి మాతృభాషకిచ్చే ప్రాధాన్యత’ అనే అంశంపై, డా. అద్దంకి శ్రీనివాస్ – ప్రసిద్ధ కవి, రచయిత, రాష్ట్రపతి పురస్కార గ్రహీత – ‘తెలుగు సాహిత్యం దశ – దిశ’ అనే అంశంపై, ప్రవాసాంధ్ర యువ అవధాని గన్నవరం లలిత ఆదిత్య – ‘తెలుగు భాష నేర్చుకోవలసిన ఆవశ్యకత’ అనే అంశాలపై ప్రసంగించారు.
ఈ క్రింది పేర్కొన్న భాషాభిమాన గాయనీ గాయకులు తెలుగు భాషా వైభవంపై పద్యాలు, పాటలు పాడి అందరినీ అలరించారు.
సున్నపురాళ్ళ సాయి కిరణ్ (అనంతపురం), షేక్ షహీద్ (ఆదిలాబాద్), విష్ణుభట్ల ప్రహర్షిత, (హైదరాబాద్), ఏలూరు యంగన్న కవి (అనంతపురం), నూకతోటి శరత్ బాబు (ఒంగోలు), బి. టి. నాగేంద్ర (అనంతపురం), చంద్రా నాయక్ (విజయవాడ), బండ వెంకన్న (మహబూబాబాద్), కుంచెపు అంజి (అనంతపురం), కృషిత నందమూరి (పెన్సిల్వేనియా), ధీరజ్ యలమంచి ( పెన్సిల్వేనియా), శ్రీ జరుగుల (న్యూ జెర్సీ), పాలవలస రఘు (విజయనగరం), బి. యశోద (పార్వతీపురం), రామ మనోజ్ కుమార్ (విజయనగరం)
ఈ కార్యక్రమం మొత్తాన్ని అత్యంత ఆసక్తిదాయకం గా నిర్వహించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ సభను విజయవంతం చేయడంలో తోడ్పడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.