NRI-NRT

హైదరాబాద్‌లో ఎమిరేట్స్ ఈ-బోర్డింగ్

హైదరాబాద్‌లో ఎమిరేట్స్ ఈ-బోర్డింగ్

కాగిత రహిత విమానాశ్రయం దిశగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరిన్ని అడుగులు వేస్తోంది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లే ప్రయాణికులకు తాజాగా ఈ-బోర్డింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి దుబాయి తదితర నగరాలకు ఈ ఎయిర్‌లైన్స్‌ ద్వారా వెళ్లే ప్రయాణికులు కాగిత రహితంగా బోర్డింగ్‌ తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఆ ఎయిర్‌లైన్స్‌ ఈ విధానాన్ని వినియోగించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్‌ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చిన విమానాశ్రయంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. వాస్తవానికి 2015 డిసెంబరు నుంచే అన్ని దేశీయ విమాన సర్వీసులకు కాగిత రహితంగా ఈ-బోర్డింగ్‌ అందిస్తోంది. తాజాగా అంతర్జాతీయ సర్వీసులకు విస్తరించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ పణికర్‌ మాట్లాడుతూ ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అత్మనిర్భర్‌ భారత్‌, డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇవీ ప్రయోజనాలు: ఈ-బోర్డింగ్‌ ద్వారా ప్రయాణికులు సంప్రదాయ బోర్డింగ్‌ పాస్‌ లేదా చరవాణిలోని బోర్డింగ్‌ పాస్‌ను ఉపయోగించొచ్చు.
* విమానాశ్రయంలో వరుసలో నిలబడక్కర్లేదు. నిరీక్షణ సమయం తగ్గుతుంది.
* తనిఖీ పాయింట్ల వద్ద పాసులను పదేపదే చూపించాల్సిన అవసరం లేదు.