తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా)లో ఎన్నికల సమరం ఊపందుకుంటోంది. 25వ తేదీ సాయంత్రానికి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి తానా ఎన్నికల కమీషన్ ప్రకటన విడుదల చేయనుంది. దాదాపుగా అన్ని స్థానాలకు పోటీ జరగబోతోంది.
నరేన్ కొడాలి వర్గం నుండి కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన భక్తా భల్లా అభ్యర్థిత్వంపై ఉత్కంఠత నెలకొంది. తానా ఫౌండేషన్ ట్రస్టీగా మరో రెండేళ్ల పాటు (2023 వరకు) పదవిలో కొనసాగవలసిన భక్తా భల్లా కార్యదర్శిగా నామినేషన్ వేయడానికి ముందే రాజీనామా చేయలేదని ప్రత్యర్థి వర్గం ఆరోపణ. ఈ విషయం మీద ఎన్నికల కమిటీ సభ్యులు కూడా దృష్టి సారించారు. తానా బోర్డు సభ్యులు, న్యాయ నిపుణులు, బై లాస్ కమిటీ సభ్యుల నుండి ఎన్నికల కమిటీ భక్తా భల్లా అభ్యర్థిత్వంపై సలహాలు స్వీకరించినట్లు సమాచారం.
అయితే కార్యదర్శిగా నామినేషన్ వేసిన భక్తా భల్లా ఈ అభియోగాలను తోసిపుచ్చుతున్నారు. తాను తన నామినేషన్ కన్నా ముందుగానే ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేశానని, సాంకేతిక కారణాలు చూపుతూ తన నామినేషన్ చెల్లదని కొందరు అభియోగాలు మోపుతున్నారని ప్రకటించారు. భక్తా భల్లా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిటీ సభ్యులు తోసిపుచ్చితే ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.