Business

రేపు భారత్ బంద్-వాణిజ్యం

Business News - All India Traders Union Calls For Bharat Bandh

* జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 26 శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు. జీఎస్టీ బిల్లును సమీక్షించాలన్న డిమాండ్‌తో పాటు పెరుగుతున్న గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చామని సీఏఐటీ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ బంద్‌కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) తమ మద్దతును తెలిపింది. ఇందులో భాగంగా చక్కాజామ్‌కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. భారత్‌ బంద్‌లో 40వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటున్నాయని సీఏఐటీ తెలిపింది. నలభైలక్షల వాహనాలు నిలిపివేస్తామని తెలిపారు.

* గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారిషాక్ ఇచ్చాయి. సబ్సిడీ సిలిండర్ ధరలను మళ్లీ పెంచాయి.ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురుసంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనేఅమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో గృహ వినియోగసిలిండరు (14.2 కేజీల) ధర రూ.846.50 కు పెరిగింది.ఫిబ్రవరిలో ఇప్పటివరకు దీంతో కలిపి 3 సార్లు గ్యాస్ ధరలు రూ.100 మేర పెరిగాయి. 4వ తేదీన రూ.25 పెంచగా, 15 న మరోరూ.50 పెంచారు. తాజాగా రూ.25 పెంచడంతో సామాన్యులపైతీవ్ర ప్రభావం పడనుంది.

* కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సింటా ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్తంగా రవాణా బంద్​కు సరకు రవాణా వాహన యజమాన్య సంఘాలు పిలుపునిచ్చాయి.

* బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్‌) తగ్గే వీలున్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. కస్టమ్స్‌ తగ్గింపునకు తోడు డిమాండ్‌ బలపడుతుండటంతో స్మగ్లింగ్‌కు కొంతమేర చెక్‌ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే.

* దేశీయంగా ప్రధాన స్టాక్‌ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్‌ఎస్‌ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్‌ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్‌ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్‌ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్‌ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్‌ఎస్‌ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది.