అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అకడమిక్ స్కోరుతో పాటు జీఆర్ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. జీఆర్ఈ స్కోర్ అధికంగా ఉంటే సీటుతోపాటు ఉపకారవేతనాలూ లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కోరు ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. బాగా చురుకైన విద్యార్థులకే 300-320 మార్కులు సాధించడం కష్టం. అందుకే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. ఇందులో క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఎనలిటికల్ రైటింగ్ ఉంటాయి. వీటిలో మొదటి రెండింటికీ కలిపి గరిష్ఠంగా 340 మార్కులు, ఎనలిటికల్ రైటింగ్‌కు 6 పాయింట్లు ఉంటాయి. అందువల్ల రీజనింగ్ పరీక్షలే కీలకం. పరీక్ష సమయం 3.45 గంటలు. కరోనా కారణంగా ఈసారి జీఆర్ఈ పరీక్షను ఇంటినుంచే రాసుకునే వెసులుబాటు కల్పించారు. గత సెప్టెంబరు నుంచి పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువమంది ఆన్లైన్ పరీక్షే రాస్తున్నారు. ఇదే అక్రమార్కులకు వరమైంది.
*** అక్రమాలు ఇలా..
1. జీఆర్ఈ రాయాలనుకునే విద్యార్థి ముందుగా ఏజెన్సీని సంప్రదించాలి. వాళ్లే పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకునే సమయం చెబుతారు. దీనికి విద్యార్థే 213 డాలర్ల పరీక్ష రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి. అప్పుడే పరీక్ష తేదీలను కేటాయిస్తారు. వాటిని ఏజెన్సీకి అందించాలి. విద్యార్థి కోరుకున్న మార్కులను బట్టి డబ్బులు ముందే చెల్లించాలి.
2. పరీక్షకు ముందు కంప్యూటర్ కెమెరాతో పరీక్ష రాసే గది మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో చూపించాలి. గదిలో ఎవ్వరూ ఉండకూడదు. గది మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత పరీక్ష రాసే టేబుల్‌పై కంప్యూటర్ను పెడతారు. దీనికి అమర్చిన కెమెరా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. విద్యార్థి పక్కకు తిరిగినా.. తల తిప్పినా ఆన్లైన్ కెమెరా పసిగట్టేసి పరీక్షను అక్కడే ఆపేస్తుంది.
3. పరీక్ష రాయించేచోట ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత రహస్యంగా గదిలోకి ప్రవేశిస్తున్నారు. కెమెరా 90డిగ్రీల కోణంలో ఉండటంతో కంప్యూటర్ పక్కనుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీస్తున్నారు. అనంతరం జవాబు చిట్టీలను కీబోర్డు సమీపంలో ఉంచుతున్నారు. అభ్యర్థి తల తిప్పకుండానే పరీక్ష రాసేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
4. ఎనలిటికల్ విభాగానికి గంట సమయం ఉంటుంది. అది రాసేలోపు క్వాంటిటేటివ్, వెర్బల్ రీజనింగ్ జవాబులను నిపుణులతో సిద్ధం చేసి అందిస్తున్నారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే సంస్థకు అనుమానం రాకుండా ఇదంతా సాగిపోతోంది. డిగ్రీలో మంచి మార్కులు రానివారూ జీఆర్ఈలో 320కి పైగా మార్కులు సాధిస్తున్నారు. ఈ ఏజెన్సీ నుంచి పరీక్ష రాసిన వారిలో చాలామందికి 310-325 మధ్య వచ్చాయి.