ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికలకు సంబంధించి నేడు నామినేషన్ల తుది పట్టిక విడుదల సందర్భంగా నలుగురు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. కార్యదర్శిగా వేమూరి సతీష్ (నిరంజన్ ప్యానెల్), అంతర్జాతీయ సమన్వయకర్తగా వడ్లమూడి హితేష్ (నిరంజన్ ప్యానెల్), ప్రత్యేక ప్రాజెక్టుల సమన్వయకర్త (Councillor At Large)గా కొణిదెల లోకేష్ నాయుడు (నరేన్ ప్యానెల్), బోర్డు సభ్యురాలిగా దేవినేని లక్ష్మీ, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ఛైర్మన్ కనకంబాబు ఐనంపూడి ప్రకటించారు.
*** కారణాలు
* ఫౌండేషన్ ట్రస్టీగా 2023 వరకు పదవీ కాలం ఉన్న భక్తా భల్లా కార్యదర్శి పదవికి నరేన్ ప్యానెల్ నుండి నామినేషన్ సమర్పించారు. కానీ ఆయన రాజీనామా సరైన సమయంలో అందలేదని ఎన్నికల కమిటీ న్యాయ నిపుణులను, తానా బై లా కమిటీని సంప్రదిస్తుందని TNI నిన్న వార్త ప్రచురించిన విషయం విదితమే(Bhakta Bhalla Nomination For TANA 2021). ఈ కారణంగానే భక్తా నామినేషన్‌ను ఎన్నికల కమిటీ తిరస్కరించి నిరంజన్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా బరిలో నిలిచిన వేమూరి సతీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారని సమాచారం. ఈ విషయంపై భక్తాను వివరణ కోరగా తనకు ఏకగ్రీవానికి సంబంధించిన సమాచారం లభించలేదని వెల్లడించారు.
* ప్రత్యేక ప్రాజెక్టుల సమన్వయకర్తగా (Councillor at large) నిరంజన్ ప్యానెల్ నుండి న్యూజెర్సీకి చెందిన రామిశెట్టి సుమంత్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఫెడెక్స్ ద్వారా ఈయన నామినేషన్ రెండు సార్లు సమర్పించారు (ఫౌండేషన్‌కు ఒకటి, కార్యవర్గ పదవికి ఒకటి ). రెండో నామినేషన్ డెలివరీ చేయవద్దని ఫెడెక్స్‌కు సూచించినప్పటికీ వారు ఎన్నికల కమిటీకి నామినేషన్ డెలివరీ చేయడంతో నిబంధనల రీత్యా రెండు నామినేషన్లు సమర్పించినందుకు ఆయనను అనర్హుడిగా ప్రకటించి నరేన్ ప్యానెల్ నుండి లోకేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
* అంతర్జాతీయ సమన్వయకర్తగా నరేన్ ప్యానెల్ నుండి హేమా కానూరు నామినేషన్ సమర్పించారు. కానీ నామినేషన్లో తానా సభ్యుల సంతకాలు కూడా ఉండాలనే నిబంధన ఉంది. హేమా కానూరు సభ్యత్వం లేని వారి సంతకంతో కూడిన నామినేషన్ సమర్పించిన కారణంగా ఆయన ప్రత్యర్థి నిరంజన్ ప్యానెల్‌కు చెందిన వడ్లమూడి హితేష్ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది.
* డోనర్ కోటాలో తానా సభ్యుల “అక్కయ్య” దేవినేని లక్ష్మీ బోర్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రకటించిన నాలుగు ఏకగ్రీవాల్లో ఇద్దరు తమ ప్యానెల్ నుండి ఎన్నిక కావడం శుభసూచకమని, తానాలో సరికొత్త శకానికి ఇది నాంది అని శృంగవరపు నిరంజన్ అన్నారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కార్యదర్శి పొట్లూరి రవి, బోర్డు ఛైర్మన్ కోయా హరీష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు.