NRI-NRT

పేరు స్వాతి. ఊరు నెల్లూరు. చేసేది ఎన్నారై బ్యాచిలర్స్‌ను మోసం.

Swathi From Nellore Arrested For Cheating NRIs

పురుషుడిగా.. మహిళగా.. అమ్మాయిగా.. ఎలా కావాలంటే అలా అప్పటికప్పుడు గొంతు మార్చేసి మాట్లాడుతుంది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నిమిషాల్లో ఖాతాలు ఖాళీ చేసేస్తుంది. స్వాతి.. అర్చన.. జూటూరి వరప్రసాద్‌.. జూటూరి ఇందిరా ప్రియదర్శిని.. పుష్యతి… ఇలా రకరకాల పేర్లతో ఎంతోమంది ఎన్‌ఆర్‌ఐలకు టోపీ పెట్టిన మాయ‘లేడీ’ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు కటకటాల్లోకి పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రంగనాయకులపేటకు చెందిన స్వాతి (30) ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. అధ్యాపకుడిగా పనిచేసే కోరం దుర్గాప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ పోచారంలో నివాసముంటోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటై మోసాలు చేయడం ప్రారంభించింది. పెళ్లి చేసుకుంటానంటూ ఆమె నిండా ముంచేసిందని పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. గతేడాది బెయిల్‌పై విడుదలైనా ఆమె తీరు మార్చుకోలేదు. స్థానికులైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశంతో ఈసారి ఎన్‌ఆర్‌ఐలను లక్ష్యంగా చేసుకుంది. గుర్తు తెలియని మహిళల ఫొటోలను గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి నకిలీ ప్రొఫైల్స్‌ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసింది. విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉంటానని, కేవలం ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే సంప్రందించాలని ప్రొఫైల్‌లో పేర్కొంది. ఇక్కడే చాలా తెలివిగా అడుగు ముందుకేసింది. విదేశాల్లో ఉంటున్నట్లు అందర్ని నమ్మించాలంటే అక్కడి ఫోన్‌ నంబర్‌ కావాలి. అందుకోసం అంతర్జాలంలో శోధించింది. చివరకు ఒక మొబైల్‌ యాప్‌ (సెకండ్‌ లైన్‌) కనిపించింది. ఈ యాప్‌ ద్వారా విదేశాల్లో ఉన్నట్లు వర్చువల్‌ నంబర్‌ను రూపొందించుకుంది. ఈ నంబర్‌ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేసింది. దీని ద్వారానే సంప్రదింపులు జరిపేది. నేరుగా పెళ్లి కొడుకులు ఫోన్‌ చేస్తే అంతగా ఆసక్తి చూపించేది కాదు. మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి, వాళ్లు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని షరతు విధించేది. దీంతో పెళ్లి కొడుకులు తమ తల్లిదండ్రులతో మాట్లాడించేవారు. ఒక (అడ్‌కామ్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆమె వాళ్లతో అమ్మాయి తండ్రి/తల్లి/సోదరి/సోదరుడిగా గొంతు మార్చి మాట్లాడేది. పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు, కట్నం, కల్యాణ మండపం, ముహుర్తాలు తదితర అంశాలపై ‘పెళ్లి పెద్దలు’గా చర్చించేది. అమ్మాయి సెలవులపై రెండు, మూడ్రోజుల కిందటే భారత్‌కు వచ్చిందని, కావాలంటే నేరుగా కలిసి మాట్లాడొచ్చని చెప్పేది. తరువాత చాలా మందికి ఇక్కడి ఫోన్‌ నంబర్‌ ఇచ్చింది. ఆ నంబర్‌కు పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు ఫోన్‌ చేయగానే నాకిష్టమే అని అంగీకారం తెలిపేది. కాకపోతే పెళ్లికి ముందే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరేది. కాబోయే కోడలే కదా అనే ఉద్దేశంతో చాలా మంది డబ్బులిచ్చారు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేగానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తూ వచ్చింది. ఈ తరహాలోనే పలువురు ఎన్‌ఆర్‌ఐలకు టోపీ పెట్టింది. ఇటీవల ఫిర్యాదు రావడంతో రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆమె ఆటకట్టించారు. ఘట్‌కేసర్‌లో అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించడంపై దృష్టి సారించారు.