ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు నెలనెలా తెలుగు వెన్నెలధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 163వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా మోదలు అయింది మరియు ముఖ్య అతిథిగా పి. వి. శేషరత్నం విచ్చేశారు. మాతృ భాషా దినోత్సవం కూడా అదే రోజు కావడం సభికులలో మరింత ఉత్సాహం నింపింది. చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల పాడిన “తులసి ప్రియ తులసి జయమునీయవే “అన్న గేయంతో సభ ప్రారంభమైంది.
ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహారెడ్డి కొన్నిపొడుపుకథలు, జాతీయాలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలోభాగస్వాములును చేశారు. ఉపద్రష్టసత్యం “పద్య సౌగంధం” శీర్షికన మహాభారత విరాటపర్వం లోని “ఎవ్వని వాకిట నిభమదపంకంబు” అన్న పద్యం యొక్క తాత్పర్య సహిత విశేషాన్నివివరించారు. “రాజభూషణ రజో రాజిన్” వంటి సమాసప్రయోగాలు తిక్కనార్యుని కవితావైభవాన్ని పతాకస్థాయికి ఎలా చేర్చాయో ఉపద్రష్ట వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, ఫిబ్రవరి మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు, ఎందరో మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. దీనిలో
భాగంగా డా. అరుణ కోల పాలగుమ్మి పద్మరాజు కథా రచనా వైశిష్టాన్ని కీర్తించారు. తరువాతి అంశంగా మాడ దయాకర్ పుస్తక పరిచయం చేస్తూడాక్టర్ కేశవరెడ్డి రచించిన “అతడు అడవిని జయించాడు” అన్న నవల ఎందుకు విశిష్ఠమైనదో, ఎన్నో ఇతరభాషలలో అనువాదం పొందడం వెనుక అర్హత లేమిటే ఆకట్టుకునే విధంగాప్రసంగించారు. లెనిన్ వేముల మాతృభాషదినోత్సవ సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యాన్నిచాటిన కొన్ని పద్యాలను గానం చేయడం జరిగింది.
అన్నపూర్ణ నెహ్రూ, ముఖ్య అతిథి పి.వి.శేషరత్నంని సభకు పరిచయము చేశారు, అతిథి గురించి కొన్ని మాటలు పంచుకున్నారు “ఆంధ్రభూమి దినపత్రికలో రెండేళ్ల పాటు ‘ప్రియదర్శిని మహిళా పేజి’ నిర్వహించడముతోపాటు, వీరి పలు నాటకాలు రేడియోలోను మరియు టి.వి. లోను ప్రసారమయ్యయి ‘అమ్మ కథలు – కథా సంకలనము’ మరియు ‘అక్షరం’ నవల విశ్వవిద్యాలయ విద్యార్థులచే పరిశోధనాంశముగా ఎంపిక చేయబడ్డాయి మరి కొన్ని కథలు తెలుగు అకాడెమి వారి కథా కోశంలో చోటుచేసి కొన్నమరెన్నో విశిష్టతలు కలిగి వున్నాయి తెలిపారు”.
ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పి. వి. శేషరత్నం “ఆకాశవాణి – నా అనుభవాలు ’’ గురించి ప్రసంగములో వివరించారు, ఆకాశవాణి సంస్థతో వారికున్న సుదీర్ఘ అనుబంధాన్ని, వ్యాఖ్యాతగా రచయిత్రిగా వారి అనుభవాలను విశేషమైనరీతిలో వివరించి సభికులను ఆకట్టుకున్నారు. జనులందరికీ హితాన్ని విజ్ఞాన విశేషాలనూ, వినోదాన్ని అందించడమే ఆశయంగా కలిగిన ఆకాశవాణి కేవలం బయటకు కనిపించే ఒకరేడియో పెట్టె కాదనీ, విశాలమైన ఒక గొప్ప వ్వవస్థ అనీ నొక్కిచెప్పారు. భాషా, సంస్కృతులసంరక్షణ సేవలో విశేష పాత్ర కలిగియున్న ఆకాశవాణి తన రచనా జీవితాన్ని ఎలా ప్రభావితంచేసిందీ, ఏయే సాఫల్యాలకు దారి తీసిందీ ఆకర్షణీయంగా సభికులకు వివరించారు. పాత్రల చలనం ద్వారా నవ రసాలు వ్యక్త పరచేది దృశ్య నాటకమైతే, కేవలం పాత్రల కంఠ స్వరాలద్వారానే రసపోషణ సాధించేది
ఆకాశవాణి రంగమని ప్రథాన వక్త కొనియాడారు. ఆయా రకాలకార్యక్రమాలలో వ్యాఖ్యాతలు ఏయే విధంగా వాయిస్ మాడ్యులేషన్ మార్చుతారో చేసి చూపించి అలరించారు.
ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్యవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యులు, స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంకార్యవర్గము ముఖ్య అతిథికి పి. వి. శేషరత్నంని సన్మానించి ఒక జ్ఞాపికనుఅందచేశారు. నీరజా కుప్పాచి అతిది జ్ఞాపికను అందరికి చదివి వినిపించారు “నాలుగుదశాబ్దాలు ఆకాశవాణి విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలలో వాచకురాలిగా గళంవినిపించి, మనసు మురిపించడమే కాకుండా పది కథా సంకలనాలు, పన్నెండు నవలలు మరెన్నో నాటికలు రచించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి, న్యూఢిల్లీ ఆకాశవాణి జాతీయ వార్షిక పోటీలలో ‘జీవని’ నాటకీకరణకు ప్రథమ బహుమతి, స్వాతి అనిల్ అవార్డు ‘అక్షరం’ నవలకు మరియు ‘పట్టుపురుగు’ కథకు, వంగూరి ఫౌండేషన్ వారి పోటీలలో ‘మాయ సోకని పల్లె’ కథకు ప్రథమ బహుమతి మరి కొన్ని కథలకు సి. పి. బ్రౌన్ అకాడమీ వారిబహుమతులు గెలుచుకున్న ప్రతిభాశాలి అని వివరించారు.
చివరిగా సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి కార్యక్రమంలో పాల్గొన్నసాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫునప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.