* ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (ఆర్‌ఈ) తన బుల్లెట్ 350 బీఎస్6 మోడల్స్ ధరను మరోసారి పెంచింది. 2021లో ఇలా ధరల్ని సవరించడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఈ ఏడాది బైక్ ధర దాదాపు రూ.9 వేలు పెరిగింది. దీంతో గత ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 విడుదలైనప్పుడు రూ.1.21లక్షలుగా ఉన్న ధర ఇప్పుడు రూ.1.30 లక్షలకు చేరింది. తాజాగా వేరియంట్‌ను బట్టి రూ.3,100 నుంచి రూ.3,500 వరకు పెంచారు. భారత విపణిలో బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో లభిస్తున్న విషయం తెలిసిందే.
* అగ్రరాజ్యం అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయంటూ ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా అధిక శాతం అప్పులు ఆ దేశానికి అన్ని రంగాల్లో సవాల్ విసురుతున్న చైనా నుంచి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు సైతం 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు.
* సార్వభౌమ బంగారు పథకం 2020-21 సిరీస్ Xఈఈ మార్చి 1 నుంచి మార్చి 5 వరకు పెట్టుబడుల కోసం తెరిచారు. సెటిల్మెంట్ తేదీ మార్చి 9. కనీస అనుమతించదగిన పెట్టుబడి 1 గ్రాము బంగారం. గరిష్ట పరిమితి వ్యక్తికి 4 కిలోలు, హెచ్‌యుఎఫ్ (హిందు అవిభాజ్య కుటుంబం)కు 4 కిలోలు, ట్రస్టులకు 20 కిలోలుగా పరిగణిస్తారు. సార్వభౌమ బంగారు పథకం ఇష్యూ ధర గ్రాముకు రూ. 4,662గా నిర్ణయించారు. సార్వభౌమ బంగారు పథకం 2020-21ను కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. సార్వభౌమ బంగారు పథకం ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 4,662గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపును అందిస్తోంది. అటువంటి పెట్టుబడిదారులకు, గోల్డ్ బాండ్ యొక్క ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 4,612గా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
* దేశంలో ఇంధన ధరలు శనివారం మరోసారి ఎగబాకాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25పైసలు వరకు పెంచాయి. కాగా కేవలం ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి. దిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17గా, డీజిల్ ధర రూ.81.47గా నమోదైంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.57, డీజిల్ రూ.88.70కి చేరుకుంది.
* ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్‌కు పెరిగి భారీ డిమాండ్ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు.