ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో 2021-23 కాలానికి కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవితో (Executive Vice-President) పాటు పలు కార్యవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఒకరైన నిరంజన్ శృంగవరపు TNIతో ప్రత్యేకంగా మాట్లాడారు. సంస్థకు సరికొత్త శక్తిని అందిస్తానని, ఈ ఎన్నికలు సంస్థ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. అమెరికాలో తన ప్రస్థానం, సేవా కార్యక్రమాలు, కుటుంబ నేపథ్యం తదితర అంశాలు ఆయన మాటల్లోనే….
* రాయలసీమ రైతు కుటుంబం నుండి…
కర్నూలు జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన నిరంజన్ తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం-ఇంద్రావతిలది రైతు కుటుంబం. రాజనగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు, యర్రగుంట్ల గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యనభ్యసించిన నిరంజన్, కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టాను కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు.
* 2001లో అమెరికాకు…
హైదరాబాద్‌లో కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసిన నిరంజన్ 2001లో అమెరికాకు వచ్చారు. దైమ్లర్-క్రైస్లర్, IBM వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గడించిన అనుభవంతో 2003లో సొంత ఐటీ కంపెనీని స్థాపించారు. BiTech Inc., Realsoft Inc., Diversity Direct సంస్థలకు ఆయన ప్రస్తుతం అధ్యక్షుడిగా, CEOగా వ్యవహరిస్తున్నారు.
* కుటుంబం
2003లో తెనాలికి చెందిన వుయ్యూరు స్వర్ణతో నిరంజన్‌కు వివాహం అయింది. వారికి ఒక కుమార్తె సర్వేష, కుమారుడు శౌరీష్ ఉన్నారు. గత 20ఏళ్లుగా ఈయన కుటుంబం డెట్రాయిట్‌లో స్థిరపడింది.
* సేవా కార్యక్రమాలు
తానాలో సభ్యత్వం తీసుకోక ముందు నుండి నిరంజన్ కుటుంబం సర్వేష ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాను చదువుకున్న రాజనగరం పాఠశాల గ్రంథాలయ అభివృద్ధికి, అదే గ్రామ రామాలయానికి, ఖమ్మం జిల్లాలో మంచినీటి వసతి ఏర్పాటుకు, సిరివెల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు, కడప పుష్పగిరి నేత్ర వైద్యశాలకు, పేద విద్యార్థుల ఫీజులు పుస్తకాలు తదితర సేవా కార్యక్రమాలకు విరివిగా విరాళాలు అందించారు.
*తానా ద్వారా సేవా కార్యక్రమాలు
2008 నుండి తానాతో అనుబంధం కలిగిన నిరంజన్, సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కోవిద్ సహాయ కార్యక్రమాలకు లక్ష డాలర్లు, బసవతారకం ఆసుపత్రికి $5000, తానా 5కె రన్‌కు $5000, వారధికి $4000, తానా గ్రంథాలయానికి $1000, తానా తెలుగు ఖతులకు $6000, పలు తానా మహాసభలకు $50వేల డాలర్లను అందజేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్ ద్వారా 5లక్షల డాలర్లను సమాజ హిత కార్యక్రమాలకు విజయవంతంగా వెచ్చించారు. తానా చేయూత ఉపకారవేతనాలను ప్రారంభించారు. 500 ఛ్ఫృ, 10 క్యాన్సర్, 15 కంటి వైద్య శిబిరాలను పేద ప్రజల ప్రయోజనార్థం ఏర్పాటు చేశారు. 25 తానా గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. 400 ఆసు యంత్రాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి 200 సెమినర్లను నిర్వహించారు. కోవిద్ కష్ట కాలంలో లక్ష కుటుంబాలకు సరుకులను, 3లక్షల కుటుంబాలకు ఆహారాన్ని, 6లక్షల మందికి మాస్కులను తానా ద్వారా తానా ఫౌండేషన్ ద్వారా అందజేసి రికార్డు నెలకొల్పారు.
* తానాలో నిర్వహించిన పదవులు
సహజంగా అమెరికాలో తెలుగువారికి పలు సంఘాల్లో జీవిత కాల సభ్యత్వం ఉంటుంది. దీనికి భిన్నంగా నిరంజన్‌కు కేవలం తానాలో మాత్రమే జీవిత కాల సభ్యత్వం ఉంది. ఇతర సంఘాల వైపు తన దృష్టి వెళ్లకుండా తనకు తానే ఈ నిబంధన విధించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ఇప్పటివరకు తానాలో నిర్వహించిన పదవులు.
* 2019-2021: తానా ఫౌండేషన్ ఛైర్మన్, బోర్డు సభ్యుడు, బైలా కమిటీ, సభ్యత్వ ధృవీకరణ కమిటీ, పెట్టుబడుల కమిటీల్లో సభ్యుడు.
* 2017-2019: తానా ఫౌండేషన్ ట్రస్టీ
* 2017-2018: తానా ఫౌండేషన్ ఛైర్మన్
* 2015-2017: తానా ఫౌండేషన్ కోశాధికారి
* 2013-2015: తానా ఫౌండేషన్ ట్రస్టీ
* 2013-2015: డెట్రాయిట్‌లో జరిగిన 20వ తానా మహాసభల కోశాధికారి
* 2009-2011: తానా నిధుల సేకరణ కమిటీకి అధ్యక్షుడు.
* తానాకు కొత్త రక్తం
“తన” అంటే ఒక్కరిది. “తానా” అంటే అందరిదీ అనే నినాదంతో ఈ ఎన్నికల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. తానా సభ్యులు తమ విజ్ఞతతో ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సంస్థను ఆభిజాత్య ధోరణులకు, ముఠా రాజకీయాలకు దూరంగా సేవా కార్యక్రమాలకు దగ్గరగా చేయడమే తన లక్ష్యమని…ఈ ప్రయత్నానికి ప్రవాసులు తనకు గట్టి మద్దతును ఇవ్వాలని, ఇస్తారని ఆశిస్తున్నట్లు నిరంజన్ TNIతో అన్నారు.