WorldWonders

ఒకే రోజు 3229 పెళ్లిళ్లు

ఒకే రోజు 3229 పెళ్లిళ్లు

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌ రంగులమయమైంది. ఓ అరుదైన వేడుకను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి వారి బంధుగణం నగరానికి పోటెత్తింది. అక్కడ మోగిన బాజా భజంత్రీలు నగర వ్యాప్తంగా మారుమోగాయి. రాయ్‌పుర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఒకేసారి 3,229 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. కుల, మత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ మతాల జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ అరుదైన వేడుక మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సీఎం కన్యా వివాహ యోజన పథకం కింద ఈ సామూహిక వివాహాలను జరిపించింది. భారీ మొత్తంలో వివాహాలు జరగడంతో ఈ కార్యక్రమం రికార్డులకెక్కింది. 3,229 వివాహాలు ఒకేసారి, ఒకే వేదికపై జరగడంతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోనాల్‌ రాజేశ్‌ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలోని 22 జిల్లాలకు చెందిన యువత ఆ వేదికపై పెళ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ముఖ్య అతిథిగా హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.