Health

హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా?

Are you losing hair because of your helmet?

నా వయసు 20. హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌ చేయించుకున్న తర్వాత జుట్టు బాగా పలచగా అయ్యింది. పెరగడం లేదు కూడా. అలాగే హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చిందనుకుంటున్నా. వెంట్రుకలు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? – ఓ సోదరి

తరచూ స్ట్రెయిట్‌నింగ్‌ చేయించడం వల్ల వెంట్రుకలు చిట్లి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే ఈమధ్య కొందరు కెరటిన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల తాత్కాలికంగా మెరిసినా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. రసాయనాలు ఎక్కువగా ఉండే చికిత్సలేవీ మంచివికావు.

ఇతర కారణాలు: పోషకాహార లోపం, థైరాయిడ్‌, తీవ్ర ఒత్తిడి, మితిమీరిన డైటింగ్‌, సంరక్షణ సరిగా లేకపోవడం, గాఢత ఎక్కువగా ఉండే షాంపులు వాడటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నా జుట్టు ఊడిపోతుంది. అవసరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చేపలు, గుడ్లు, నట్స్‌, ఆకుకూరలను తరచూ తినాలి. తప్పనిసరిగా వ్యాయామాలు, ధ్యానం చేయాలి. తగినంత నిద్రా ఉండాలి. రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. జంక్‌ఫుడ్‌ని తగ్గించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు ఎక్కువుగా రాలిపోతుంటే వైద్యులను సంప్రదించండి. వారి సలహాతో జుట్టు పెరుగుదలకు కావాల్సిన విటమిన్లు, బయోటిన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చు. హెల్మెట్‌ సరిగా వాడితే ఎలాంటి సమస్యా ఉండదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దీన్ని పెట్టుకుని ఎక్కువ గంటలపాటు ప్రయాణించడం మంచిది కాదు. అలా చేస్తే చుండ్రు పెరిగే అవకాశముంది. ముందుగా కాటన్‌ స్కార్ఫ్‌ చుట్టుకుని దానిపై హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఇలాచేస్తే చెమట పట్టినా స్కార్ఫ్‌ పీల్చేస్తుంది.