* నగర కార్పొరేషన్ ఎన్నికల వేళ వైసీపీ కి షాక్.వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బోను రాజేష్.పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా..వైకాపా విజయవాడ నగర బీసీ సెల్ అధ్యక్షులు బోను రాజేష్ పాయింట్స్.జగన్ ఓదార్పు యాత్రలో విజయవాడలో జగన్ తో కండువా కప్పించుకుని పార్టీ చేరా.నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పని చేసా.2014 లో తెదేపా అభ్యర్థి పై స్వల్ప ఆధిక్యంతో ఒడిపోయా.సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధ వెళ్ళిపోయాక ఇంచార్జిగా మల్లాది విష్ణు వచ్చారు,ఆయన వద్ద కూడా పని చేశా.నేను ఇదివరకు పోటీ చేసిన వార్డు ఇప్పుడు బీసీ అయింది, సీట్ ఇస్తారునుకున్న.ఒక బీసీ అభ్యర్థిగా పోటీలో నిలబడదామనుకున్న కానీ నన్ను పక్కన పెట్టి వేరే వారికి ఇచ్చారు.కనీసం ఈ వార్డు కాకపోయినా నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇస్తారునుకున్న కానీ ఇవ్వలేదు.పార్టీ పెట్టినదగ్గర నుంచి పార్టీ కోసం పని చేసిన గుర్తించలేదు.పాత 53 కొత్త 30 వ వార్డులో అభ్యర్థి చనిపోతే ఎక్కడైనా అవకాశం ఇవ్వమని అడిగా అది ఇవ్వలేదు.నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా పార్టీలోనే ఉంటే ఎదుగుదల ఉండదని భావిస్తున్న.పార్టీకి పని చేసిన వ్యక్తిని కాదని కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు.కనీసం పార్టీకోసం పని చేసిన వ్యక్తి టికెట్ ఇచ్చి పని చేయమంటే చేసేవాడిని ,ఎవరో కొత్త వ్యక్తికి ఇచ్చారు.సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే సమాధానం వచ్చింది.రాజధాని నగరమైన విజయవాడలో ఒక బీసీ కి టికెట్ ఇవ్వని పరిస్థితి.బీసీలను అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జగన్ దాకా ఈ అంశాలను తీసుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వరు.పార్టీ నన్ను గుర్తించడం లేదు కాబట్టి పార్టీని వీడాలని నిర్ణయించుకున్న.అవకాశం ఉన్న చోట కూడా ఇవ్వకుండా ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అనే పరిస్థితి వచ్చింది.సస్పెండ్ చేయకముందే నేనే పార్టీని వీడుతున్న.10 సంవత్సరాలు పార్టీ కోసం పని చేసా ,కన్నా తల్లిలాంటి పార్టీని వీడడం కష్టంగా ఉంది.కన్నీటి పర్యంతమైన బోను రాజేష్ ,రాజేష్ తో పాటు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కూడా రాజీనామా చేస్తున్నారు.
* దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి.కొత్తగా 16,752 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 113 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.మొత్తం కేసులు: 1,10,96,731మరణాలు: 1,57,051రికవరీల సంఖ్య: 1,07,75,169యాక్టివ్ కేసులు: 1,64,511వైరస్ సోకిన వారిలో 11,718 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
* పుర ఎన్నికల్లో నామినేషన్లు దాఖలుచేసి మరణించిన 59 మంది స్థానంలో అదే పార్టీకి చెందినవారి నుంచి నామినేషన్ల స్వీకరణకు పురపాలకశాఖ ఏర్పాట్లు చేసింది.ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకొని మార్చి 1న పరిశీలిస్తారు. 3న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రచురిస్తారు.గత మార్చిలో నామినేషన్లు వేసిన వారిలో 9 నగరపాలక సంస్థల్లో, 35 పురపాలక, నగర పంచాయతీల్లో కలిపి 59 మంది మృతిచెందారు.ఏ పార్టీవారు చనిపోయారో అదే పార్టీ తరఫున మరొకరు బీఫారంతో నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
* మొన్నటి వరకూ చలి ఉదయం పది గంటల వరకు మంచు. వారంలోనే వాతావరణం మారిపోయింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి.సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఫిబ్రవరి 20తో పోలిస్తే.. తునిలో 8 డిగ్రీలకు పైగా పెరుగుదల నమోదైంది.గరిష్ఠంగా కృష్ణా జిల్లా నందిగామలో 39 డిగ్రీలు, అనంతపురంలో 38.6, కర్నూలులో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.వారం క్రితం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. బుధవారం వరకు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. అక్కడ్నుంచి క్రమంగా పెరిగాయి.
* రాష్ట్రంలో సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45- 59 సంవత్సరాల (దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు) మధ్య వయసున్న వారికి కొవిడ్ టీకా పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్రాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీకా ఇవ్వబోతున్నారు.ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లోనూ టీకా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిన్ 2.0 యాప్‌లో శనివారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్ జరుగుతోంది.మొత్తం 2,222 టీకా కేంద్రాల వివరాలు యాప్‌లో ఉంటాయి.ఈ యాప్ ద్వారా అర్హులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సోమవారం నుంచి అవకాశం కల్పించనున్నారు.
* రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గొప్ప మనసు చాటుకున్నారు.దాదాపు 20 ఏళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో దత్తత తీసుకున్న ఓ యువకుడి పెళ్లి ఘనంగా జరిపించారు.పేద విద్యార్థిగా ఉన్న ఆ యువకుడి విద్యాభ్యాసానికి రాజ్‌నాథ్ సహకారం అందించారు. అతడు ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్నాడు.అతడి పెళ్లికి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు రాజ్‌నాథ్ సింగ్.ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా మదిరపుర్కు చెందిన బిజేంద్రకుమార్ 2000 ఏడాదిలో 8వ తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచాడు.ఆ సమయంలో తండ్రి మరణించడం వల్ల.. అతడి ఉన్నత చదువులకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు.అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఈ విషయం తెలిసింది.
* విద్యావ్యవస్థలో నూతన విధానాలెప్పుడూ ఉపాధ్యాయులు, విద్యార్థుల సలహాల నుంచే రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.తాము అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు.దేశంలో ఈ విధానం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ జేవియర్ కళాశాల ప్రొఫెసర్లతో రాహుల్ సంభాషించారు.ఆర్థికంగా బలమైనవారికే విద్య అనే విధానాన్ని తాను అంగీకరించనని రాహుల్ చెప్పారు.తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు స్కాలర్షిప్లను పెంచుతామని అన్నారు.
* పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అక్కడ ప్రచార జోరు పెంచాయి.ఇటీవల విశ్వాసపరీక్షలో ఓడిపోయి నారాయణస్వామి సర్కారు కుప్పకూలడంతో పోయిన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసితో పనిచేస్తుండగా, ఈసారి పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది.అందులోభాగంగానే ఇవాళ పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు.కరైకాల్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికే అధికారం కట్టబెట్ట బోతున్నారని ధీమా వ్యక్తంచేశారు.ఎన్డీయేను గెలిపిస్తే పుదుచ్చేరిలో 75 శాతంగా ఉన్న నిరుద్యోగితను 40 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
* ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కృత్రిమ గర్భధారణ విధానంలో సరోగసీ ఒకటి. భార్య అండాన్ని.. భర్త వీర్యాన్ని కలిపి.. మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలు కనాలనుకునే వారికి పరిచయం లేని వ్యక్తులు సరోగసి తల్లులు అవుతుంటారు. కానీ, అమెరికాలో ఓ మహిళ స్వలింగ సంపర్కుడైన తన సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* వైకాపా తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తెదేపా అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో ఆరోపించారు. వైకాపా ఒక పార్టీ, జగన్ ఒక నాయకుడా? అని ఆక్షేపించారు. జగన్ తాడేపల్లి ఇంటి గేటు దాటి వస్తే జనం కొడతారని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైకాపా అభ్యర్థులు జనంలోకి వెళ్లి ఓటు అడిగేందుకు భయపడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పీకమీద కత్తిపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే తెదేపా అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేశ్ విమర్శించారు.
* గుంటూరు నగరపాలక సంస్థకు పూర్వవైభవం రావాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. గుంటూరులోని 3, 8 వార్డుల్లో తెదేపా అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయని.. తెదేపా అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. తెదేపా హయాంలో నగరానికి రక్షిత మంచినీరు, భూగర్భ డ్రైనేజీ (యూడీజీ) పథకాలు తెచ్చామని జయదేవ్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 50 శాతం యూడీజీ పనులు పూర్తిచేయగా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అవి కొంచెం కూడా ముందుకు సాగలేదని ఆరోపించారు. యూడీజీ పనులు నిలిపేయడంతో ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతోందని జయదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
* రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని భాజపా నీటి బుడగలాంటిదని.. మరోవైపు తెరాస పతనం మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడుతున్నారని.. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఏడేళ్ల పాలనలో దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదని మండిపడ్డారు. భాజపా వల్ల తెలంగాణకు ప్రయోజనం లేకపోగా.. తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. దీని వల్ల లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు.
* మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు వాలంటీర్లు తమ పరిధి దాటి వ్యవహరించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఆంక్షలను అతిక్రమిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ మాట్లాడారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ అవకాశముంటుందని హెచ్చరించారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని.. ప్రభుత్వం ఇచ్చిన విధుల మేరకు వాళ్ల పరిధిలో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.