తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న జరిగిన 10వ సాహిత్య సమావేశంలో ప్రముఖ హరికధా భాగవతార్ డా. ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి భక్త పోతన సాహిత్య వైభవాన్నిఅంతర్జాలంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ తన ప్రారంభోపన్యాసంలో బమ్మెర పోతన తెలుగు సాహిత్యానికి దొరికిన విలువ కట్టలేని సహజ కవిరత్నం అని అన్నారు.
“బాల రసాల సాల నవ కోమల కావ్యకన్యకన్ కూలల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి” అంటూ తెలుగు నేలపై ఆధ్యాత్మికత అనే పంటలు పండించిన కృషీవలుడు పోతన అని అన్నారు. వేలకొలది రాసిన కవి పోతన అని,ఆయన పద్యం వినని, నోటికి రాని తెలుగువారు ఉండరనడం అతిశయోక్తి కాదని సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పేర్కొన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “హరికథ” తెలుగు సంస్కృతిలో పేరెన్నికగన్న ఒక గొప్ప ప్రాచీన కళా ప్రక్రియ అని, ఆధునిక కాలంలో హరికథలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారు మాత్రం – సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో మహా పాండిత్యం ఉన్న ఆదిభట్ల నారాయణదాసు అని అన్నారు. ఒకే భాగవతుడు ఆంగిక, వాచిక, సంగీత, సాహిత్య సమ్మేళనంగా ఏకకాలంలో ప్రదర్శించే ఈ ప్రక్రియ మన పురాణ ఇతిహాసాలలో దాగి ఉన్న భక్తిని, జ్ఞానాన్ని జనరంజకంగా ఆవిష్కరించగల శక్తి ఉన్న కళ అని, ఇటువంటి మన అరుదైన గొప్ప కళా ప్రక్రియలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
డా. సింహాచల శాస్త్రి తెలుగు సాహితీ వినీలాకాశంలో హరికథా వైభవం గూర్చి వివరిస్తూ…పోతన బాల్యంనుంచి ఒక మహా కవిగా ఎదిగిన తీరును, భక్త పోతన రచించిన పద్యాలను అద్భుతంగా గానం చేస్తూ, ఆసక్తికరమైన వ్యాఖ్యానాలతో, హాస్య చతురోక్తులతో అద్భుతంగా రెండు గంటల పాటు కనులకు పసందుగా, వీనుల విందుగా ఈ కార్యక్రమం వీక్షకులను అలరించింది.