ఏడాది విరామం తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మెరిసింది. ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌కు షాకిస్తూ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో ఫొగాట్ 10-8తో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెనెసా (బెలారస్)ను ఓడించింది. అయితే తుది పోరులో ఆమె నాటకీయ రీతిలో విజయాన్ని చేజిక్కించుకుంది. ఒక దశలో 6-8తో వెనకబడ్డ ఫొగాట్ మరో 25 సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా అద్భుతంగా పుంజుకుంది. డిఫెన్స్‌లో ఉన్న ప్రత్యర్థి కాళ్లను ఒడుపుగా పట్టేసి పడేసి ఒకేసారి 4 పాయింట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తుది పోరు ఆరంభంలో వినేశ్దే జోరు! ఆమె ప్రత్యర్థిని పట్టేసి 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ వెనెసా దీటుగా స్పందించింది. వెంటనే 4-4తో స్కోరు సమం చేసింది. విరామానికి పది సెకన్ల ముందు మరో రెండు పాయింట్లు సాధించిన వినేశ్ 6-4తో మరోసారి ఆధిక్యంలో నిలిచింది. కానీ మళ్లీ పుంజుకున్న వెనెసా ఒకేసారి నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుని 8-6తో విజయం ముంగిట నిలిచింది. అయితే ఆఖరి సెకన్లలో పుంజుకున్న వినేశ్.. ప్రత్యర్థికి నిరాశ మిగిల్చింది.
ఫోగాట్ విజయం
Related tags :