“వీధి అరుగు” రెండవ అంతర్జాల చర్చా కార్యక్రమం
పలు దేశాల్లో ఉన్న తెలుగు వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న “వీధి అరుగు” రెండవ చర్చా వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతార్జాల దృశ్య సమావేశ పద్ధతిలో దాదాపు రెండు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో “కృత్రిమ మేధస్సు – సామాజిక సన్నద్ధత” అంశంపై ఐఐటి ఢిల్లీ నిర్దేశకులు ఆచార్య వలిపే రాంగోపాల్ రావు గారు మరియు అగణిత అభిజ్ఞ పరిష్కారాల వ్యవస్థాపకులు డా. కన్నెగంటి రామారావు గారు ప్రసంగించారు.
ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం, మన దేశ విద్యా వ్యవస్థలో సమున్నత మార్పులకు నాంది పలుకుతోంది. ఈ మార్పును శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో, పరిశోధనా రంగంలో విశేష అభివృద్ధి కి దోహదం చేసే మేలిమలుపుగా అభివర్ణించవచ్చు. సామాజిక అవసరాలను తీర్చేసిగా మన విద్యావిధానం, సామాజిక అవసరాలను తీర్చేవిగా మన విద్యావిధానం, మన పరిశోధనా రంగం ముందుచూపుతో ఉండాలని, సామాజిక అవసరాలకు తగ్గట్లే పరిశోధనాంశాన్ని ఎన్నుకోవాలని, వ్యవసాయ రంగానికి సెన్సార్ టెక్నాలజీ అనుసంధానంతో విశేషఫలితాలు ఉంటాయని, నానో టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో నిరంతర భూసార పరీక్షా ప్రక్రియ, తద్వారా సాగుకు అనువైన పంటల నిర్ణయం, భూమికి కావాల్సిన పోషకాలు, ఎరువులు, వాటిని ఉపయుక్తంగా అందించే విధానం వంటి ఎన్నో నూతన సాగువిధానాలు అవలంబించవచ్చు అని ఆచార్య రాంగోపాల్ రావు గారు ప్రసంగించారు.
భారతీయ ఉన్నత విద్యావిధానంలో మోరిల్ యాక్ట్ ఆవశ్యకతను, పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య సేవలు వంటి అనేక రంగాల సర్వతోముఖాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపకరిస్తుంది. పరిశోధన ద్వారా గడించిన విజ్ఞానాన్ని సంపద సృష్టి వైపు మళ్ళించాలి. అలా సంపద సృష్టించటానికి, క్షేత్ర స్థాయిలో వెలుగుచూసిన ఆవిష్కరణలు కార్యక్షేత్రంలో ఆచారణాత్మకంగా అమలుచేసి, అభివృద్ధి చేయాలి అని వీధి అరుగు వీక్షకులుకు రాంగోపాల్ రావు గారు తెలియచేసారు.
సంక్లిష్టమైన శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా సరళతరం చేయటమే సాంకేతికత లక్ష్యం. మానవ నిపుణులకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వేగవంతమైన పనితీరు కృత్రిమమేధ కున్న బలం. ప్రశ్న కు వేగంగా సమాధానం ఇచ్చే కృత్రిమమేధ అందుకు వివరణ ఇవ్వలేకపోవటం ప్రశ్నలు సంధించలేక పోవటం సందర్భానుసారం వ్యవహరించలేకపోవటం ప్రతికూల అంశాలు అని డా. కన్నెగంటి రామారావు గారు ఉపొద్ఘాటించారు.
విరివిగా కృత్రిమమేధ ఉపయోగం వల్ల జనసాంద్రత కలిగిన దేశాలలో పెక్కుమందికి ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఇంకొందరు సృజనశీలురకు సరైన గుర్తింపు దొరక్క వారు వృత్తిరీత్యా ఆత్మన్యూనత కు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఈ వీధి అరుగు కార్యక్రమంలో డా. రామారావు గారు చర్చించారు.