* దేశంలో అయిదేళ్ల తర్వాత మళ్లీ రేడియో తరంగాల (స్పెక్ట్రమ్) వేలం మంగళవారం జరిగింది. స్పెక్ట్రమ్ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ రూ.18,669 కోట్ల బిడ్లు దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా రూ.1,993 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఏడు బాండ్లలో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. వీటిలో అత్యధికంగా రిలయన్స్ జియో దక్కించుకుంది.
* ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో మరోసారి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చర్చ నడుస్తోంది. అయితే, వీటికి ఉన్న ప్రధాన సమస్యల్లో బ్యాటరీ ఛార్జింగ్ ఒకటి. ఎక్కువ సేపు ఛార్జ్ చేయాల్సి రావటంతో వాహనాదారులు ఇప్పటికీ వీటిపై ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘లాగ్-9’ 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని సిద్ధం చేసింది. గ్రాఫీన్‌ను ఉపయోగించి సూపర్ కెపాసిటర్ టెక్నాలజీ ద్వారా ఈ బ్యాటరీలను తయారు చేసినట్లు ‘లాగ్9’ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాటరీలు కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవ్వడమే కాదు, 15ఏళ్లకు మించి పనిచేస్తాయని తెలిపింది. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే, నాణ్యత, దృఢత్వాన్ని కలిగి ఉంటాయని వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి బ్యాటరీతో నడిచే 3వేల వాహనాల (2వీలర్, 3వీలర్)ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* అసలే ఇంధన ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరోపిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్‌ఇండియా ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. ‘‘గతేడాది నుంచి డీజిల్ ధరలు దాదాపు 35శాతం వరకు పెరిగాయి. దీంతో ఫుల్ ట్రక్‌లోడ్ డీల్స్ రవాణా ఛార్జీలు 25-30శాతం వరకు పెరిగేందుకు కారణం కావచ్చు. సాధారణంగా ఇటువంటి డీల్స్ పెద్ద కంపెనీల మధ్య జరుగుతాయి. సాధారణంగా వార్షిక, అర్థ సంవత్సరానికి కంపెనీలతో ముందే ఒప్పందాలు అవుతాయి. ఇప్పటికే నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా మధ్యలో రేట్లు పెంచడానికి సాధ్యపడదు. ఆ భారాన్ని మేమే భరించాలి. అవి రవాణ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మా మూలధన వ్యయాలు పెరుగుతాయి. అందుకే డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దేశ వ్యాప్తంగా చమురు ధరలు ఒకేలా ఉండాలి. అప్పుడే అన్ని ప్రదేశాలకు మా ట్రక్కులను పంపిస్తాము. నెలకోసారి మాత్రమే ఇంధన ధరల్లో మార్పులు ఉండాలి ’’ అని ఆయన వివరించారు.
* దేశంలో గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న బంగారం ధర మంగళవారం భారీగా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే సుమారు రూ.700 తగ్గి రూ.47,000(10గ్రాములు) మార్క్‌కు చేరుకుంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. రూ. 500 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 69,500 పలికింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47,050గా నమోదైంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టినప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం లాభాల్లో ముగియడం గమనార్హం. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడం మదుపర్లలో విశ్వాసం నింపింది. ఓ దశలో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో డీలాపడ్డ సూచీలు తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం 50,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,439 వద్ద గరిష్ఠాన్ని.. 49,807 వద్ద కనిష్ఠాన్ని తాకింది.