Movies

ఏమిటీ పని కాజల్?

ఏమిటీ పని కాజల్?

లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో మన హీరోయిన్లు నేర్పరులే. అవకాశాలు తగ్గాయేమిటన్న ప్రశ్నకు తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పుకుంటారు. అలాంటి వారిలో నటి కాజల్‌ అగర్వాల్‌ ఉంది. ఈ ఉత్తరాది బ్యూటీ కెరీర్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ చాలానే ఉన్నాయి. మొదట్లో మాతృభాషలో క్యోమ్‌ హో గయా చిత్రంతో చిన్న పాత్రలో నటించినా ఆ చిత్రం ఆమెకు ఏ మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా బొమ్మలాటం చిత్రం ద్వారా పరిచయం చేసినా ఆ చిత్రమూ నిరాశనే మిగిల్చింది. తెలుగులో లక్ష్మీకల్యాణం విజయాన్ని అందించినా, ఆ తరువాత స్టార్‌ ఇమేజ్‌ కోసం చాలా కాలం పడిగాపులు పడాల్సి వచ్చింది. మగధీరతోనే కాజల్‌ అగర్వాల్‌కు సరైన సక్సెస్‌ వచ్చింది.అదే విధంగా కోలీవుడ్‌లో తుపాకీ చిత్రం వరకూ విజయం కోసం తపిస్తూనే ఉంది. ఇక హిందీలో నాలుగైదు చిత్రాలే చేసినా అక్కడ సరైన ఇమేజ్‌ను ఇప్పటికీ పొందలేకపోయింది. మొత్తం మీద మూడు భాషల్లో నటిస్తున్న కాజల్‌ను హిందీలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చాలా నైస్‌గానే కవర్‌ చేస్తూ బదులిచ్చింది. ఇంతకీ తను చెప్పిందేమిటంటే హిందీలో ఎక్కువ చిత్రాల్లో నటించాలన్న కోరిక తనకూ ఉందని, అయితే తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లభించడంతో బాలీవుడ్‌లో ఫోకస్‌ పెట్టలేని పరిస్థితి అని చెప్పింది. అయినా మూడు భాషల్లో ఏకకాలంలో నటించడం కష్టమేనని చెప్పుకొచ్చింది. నిజానికి కాజల్‌కు హిందీలో అవకాశాలేమీ లేవు. ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ ప్యారిస్‌ ప్యారిస్‌ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. ఇక తెలుగులో రెండు చిత్రాలు ఉన్నాయి. అవకాశాలు తగ్గుముఖం పడుతున్న విషయం గ్రహించే అమ్మడు ఇటీవల ఒక ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసి వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుంది. అందులో అధిక గ్లామరస్‌ ఫొటోలే ఉండడం విశేషం. వాటిలో అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాల్లో హాల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన అభిమానులు కాజల్‌ను రకరకాల ప్రశ్నలతో ఏకేస్తున్నారు. కొందరు మాత్రం బాగున్నాయంటూ కాజల్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు.