Politics

కేరళ ముఖ్యమంత్రిగా మెట్రో శ్రీధరన్-తాజావార్తలు

కేరళ ముఖ్యమంత్రిగా మెట్రో శ్రీధరన్-తాజావార్తలు

* కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘మెట్రోమ్యాన్’ ఈ శ్రీధరన్‌ కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. కేరళ భాజపా చీఫ్ కే సురేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే మిగతా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు. శ్రీధరన్ ఇటీవల భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కమలం పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.

* 570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్​ఈసీ.నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది….నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన నేపథ్యంలో… నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20.68 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని ఎస్​ఈసీ వివరించింది.

* అంగారక గ్రహం మీదకు వెళ్లాలన్న లక్ష్యంతో స్పేస్ఎక్స్ సంస్థ తయారు చేసిన స్టార్​షిప్ రాకెట్ ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే పేలిపోయింది.ఇప్పటికే ఈ స్టార్​షిప్ నమూనా ప్రయోగం రెండు సార్లు విఫలమైంది.స్పేస్​ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తొలుత స్టార్ షిప్ ప్రయోగం సఫీలకృతమైందంటూ హర్షం వ్యక్తం చేశారు.’ఎస్ఎన్10 స్టార్ షిప్’ విజయవంతంగా ల్యాండ్​ అయిందని ట్వీట్​ చేశారు.కొద్ది నిమిషాల తర్వాత ‘ఆర్​ఐపీ ఎన్​ఎన్​10’ అంటూ మరో ట్వీట్​ చేశారు.టెక్సాస్​లో ప్రణాళిక ప్రకారమే ప్రయోగం జరిపినప్పటికీ లాంచ్​ప్యాడ్​ వద్దకు చేరుకున్న కొద్దిసేపటి తర్వాత ‘ఎస్​ఎన్​10’ ఒక్కసారిగా పేలిందని స్పేస్​ఎక్స్​ తెలిపింది.స్టార్​షిప్ రాకెట్ పూర్తిస్థాయి పునర్వినియోగ వాహక నౌక.అంగారకుడితో పాటు, చంద్రుడిపైకి మనుషులను పంపించేందుకు స్పేస్ఎక్స్ దీన్ని తయారు చేస్తోంది.మనుషులను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకూ ఇది ఉపయోగపడుతుంది.

* ప్రపంచ పర్యటక కేంద్రం ఆగ్రాలోని తాజ్​‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్‌ బూటకమని అని తేలింది.కంట్రోల్‌ రూమ్‌కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు తాజ్‌మహల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు.పర్యటకులను బయటకు పంపి బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.దీంతో బాంబు బెదిరింపు కాల్‌ ఆకతాయిల పనిగా నిర్ధరించారు.”బాంబ స్క్వాడ్​ సహా ఇతర బృందాలు తాజ్​మహల్​ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎలాంటి అనుమానించ దగ్గ వస్తువులు దొరకలేదు.బాంబు సమాచారం ఇచ్చిన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటాం. 99% ఇది తప్పుడు సమాచారమే.” అని చెప్పారు ఆగ్రా ఐజీ సతీశ్​ గణేశ్.బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత తిరిగి సందర్శకులను అనుమతించారు.ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యవసర సేవల నంబర్ 112కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.తాజ్​మహల్​ లోపల బాంబు పెట్టినట్లు సదరు వ్యక్తి సమాచారమిచ్చాడు.అప్రమత్తమైన అధికారులు వెంటనే కేంద్ర పరిశ్రమల భద్రత దళం (సీఐఎస్​ఎఫ్​) సహా బాంబు, డాగ్​ స్వ్కాడ్​లతో మొత్తం తాజ్​మహల్​ పరిసర ప్రాంతాల్ని జల్లెడ పట్టారు.

* విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిని తెదేపా ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను ఖరారును చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి బరిలో ఉన్నారు. 24 ఏళ్ల కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ (సైకాలజీ, ఎకనామిక్స్‌) చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌.. ఐర్లాండ్‌లో చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేశారు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రహదారి, ఆలయంలోని అద్దాల మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని.. భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని చెప్పారు. మూలవిరాట్టుకు జరిగే సేవలు దూరం నుంచి కూడా కనిపించాలన్నారు.

* ఇంట్లో ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వాట్సాప్‌ యాప్‌లో ఛాట్‌ చేస్తున్నారు… ఇంతలోగా అవతలి వ్యక్తి మీకు కాల్‌ చేశారు. మొబైల్‌ చూస్తే ఛార్జింగ్‌లో ఉంది. కంప్యూటర్‌లో ఉన్న వివరాలు చూసుకుంటూ.. వాట్సాప్‌ వీడియో కాల్‌లో అవతలి వ్యక్తికి వివరాలు చెప్పాలి. ఇప్పుడైతే దీని కోసం సిస్టమ్‌, మొబైల్‌ రెండూ వాడాల్సిందే. అయితే ఈ ఇబ్బందులు త్వరలో మీకు ఉండవు. ఎందుకంటే డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

* రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరు అనేది నానుడి. రాజకీయాల్లో ఇద్దరు బద్ద శత్రువులో.. రెండు వైరి రాజకీయ పక్షాలు ఒక్కటైనప్పుడో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. కానీ, ఒక చోట మిత్రుడిగా.. ఇంకో చోట ప్రత్యర్థిగా.. ఓ చోట స్నేహహస్తం అందిస్తూ.. మరో చోట ప్రత్యర్థికి ఆపన్నహస్తం అందించే కొత్త ట్రెండ్‌ ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌.

* తెరపై తన ఎనర్జిటిక్‌ నటనతో ప్రేక్షకులను ఉత్సాహపరిచి, తనదైన శైలిలో పంచులు పేలుస్తూ యూత్‌కు రాజ్‌తరుణ్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక ప్రత్యేక జోనర్‌ ఎంచుకుని ‘పవర్‌ ప్లే’తో మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీవితాలతో ఆడుకునే కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాలను రాజ్‌తరుణ్‌ ఇంటర్వ్యూలో వివరించారు. మరి ఆ కథేంటో చూద్దామా!

* ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. ‘‘ ప్రస్తుతం ఇంటర్నెట్‌, ఓటీటీల్లో సినిమాలు, వీడియోలు చూడటం చాలా సాధారణమైపోయింది. కాబట్టి దీనిపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారమవుతోంది.’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

* భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ టీకా తమ దేశంలో అత్యవసర వినియోగం కింద పంపిణీ చేసేందుకు ఆఫ్రికా దేశం జింబాబ్వే ఆమోదం తెలిపింది. దీంతో సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జింబాబ్వేలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకా 81శాతం సమర్థత కలిగినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించిన మరుసటి రోజే జింబాబ్వే అనుమతించింది. దీంతో ఆఫ్రికాలో కొవాగ్జిన్‌ను ఆమోదించిన తొలి దేశంగా జింబాబ్వే నిలిచింది.

* కరోనా మహమ్మారి వల్ల ఏర్పడి సంక్షోభ సమయంలోనూ భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో ఎఫ్‌డీఐలు 40శాతం పెరిగి దేశంలో 51.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

* పిచ్‌.. పిచ్‌.. పిచ్‌.. నాలుగో టెస్టు పిచ్‌పై సందిగ్ధం తొలగిపోయింది! పట్టుదలతో ఆడిన బ్యాట్స్‌మెన్‌కు.. కట్టుతప్పని బౌలర్లకు అది సహకరించింది. స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/47) మాయాజాలానికి సిరాజ్‌ (2/45) పేస్‌ తోడవ్వడంతో ఇంగ్లాండ్‌ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 24/1తో నిలిచింది.