వృత్తికి తానొక ప్రొఫెసర్ అయినా నిజజీవితంలో తాను నిరంతర విద్యార్థినని, 2003నుండి 18ఏళ్లుగా తానాలో పలు కీలక పదవుల్లో సేవకుడినని 2021-23 కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి బరిలో ఉన్న కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన కొడాలి నరేన్ TNIతో అన్నారు. వర్జీనియాలోని ప్రఖ్యాత జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో 1997లో PhD నిమిత్తం అమెరికాలో విద్యార్థిగా అడుగుబెట్టిన తాను గత 24ఏళ్లలో అమెరికన్ డ్రీం అనే పదాన్ని సార్ధకం చేసుకున్నానని, అందుకే తానా ప్రధానోద్దేశంలో సాంఘిక, సాంస్కృతిక అంశాలతో పాటు తన హయాంలో విద్యా-ఇమ్మిగ్రేషన్ సేవలను కూడా విస్తృతం చేయాలనే ప్రణాళికతో ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు. తాను విద్యార్థి దశ నుండి H1Bలో ఉన్నానని, అనంతరం గ్రీన్‌కార్డు పొందానని…ఈ ప్రక్రియ మొత్తంపై తనకు లోతైన పూర్తి అవగాహన ఉన్న కారణంగా తన అనుభవాలను ప్రవాసులకు కూడా అందించి వారికి మార్గనిర్దేశం చేసి అధ్యాపక వృత్తికి అర్థం చేకూర్చాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ఒక వైద్యుడి(డా.కాకర్ల సుబ్బారావు) ఆలోచనలో పుట్టిన తానాను మరెందరో వైద్యులు గత 40ఏళ్లకు పైగా శారీరకంగా ధృఢంగా మార్చారని, తొలిసారిగా ఒక PhD డాక్టర్‌కు అవకాశం కల్పిస్తే మేధోపరంగా ధృఢంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
వివాదరహితుడిగా, విద్యావేత్తగా, ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థిగా తానాతో పాటు అమెరికాలో జాతీయస్థాయిలో మంచిపేరు కలిగిన నరేన్….ఈసారి తనను గెలిపిస్తే తానాలో కార్యకర్తలను బలోపేతం చేస్తూ, తార్కికమైన ప్రణాళికలను సమర్థిస్తూ, అధ్యక్షుడు-అభ్యర్థి-ప్రతినిధి అనే వ్యత్యాసాలను చేరిపేస్తూ జవాబుదారీతనానికి గొడుగు పడతానని అంటున్నారు.
సైబర్ సెక్యూరిటీ నైపుణ్యం కలిగిన నరేన్…2003లో మొదటిసారిగా తానాలో ఐటీ విభాగానికి కో-చైర్‌గా వ్యవహరించారు. సంస్థలో వేళ్లూనుకుపోయిన ఛాందస పద్ధతులకు స్వస్తి పలికి, సాంకేతికతను జోడించి సంస్థ ప్రయాణంలో అంతర్లీనంగా సాగుతున్న సమస్యలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు అన్నారు. BOD కార్యదర్శి, అధ్యక్షుడిగా, తానా రాజ్యాంగ నిర్మాణ కమిటీలో సభ్యుడిగా, రూపకర్తగా, దానిని పటిష్ఠపరిచే ఎన్నో సవరణలకు ఆద్యుడిగా నరేన్ సుపరిచితులు.
పనిచేసే వారికి పట్టం కడతానని, క్రింది స్థాయిలో తానా తల్లివేరుకు ఎవరు నీరు పోస్తారో అలాంటి వారికి ఆ చెట్టు కింద నీడలో సాంత్వన కలిగించే చర్యలకు తనను గెలిపిస్తే పెద్దపీట వేస్తానని నరేన్ అంటున్నారు. ఆయన తానాలో నిర్వహించిన వివిధ పదవులు, ఆయన ప్యానెల్ సభ్యుల వివరాలు దిగువ పరిశీలించవచ్చు….
—సుందరసుందరి(sundarasundari@aol.com)