Politics

మోడీ…కాస్త మమ్మల్ని ప్రేమించండి-తాజావార్తలు

News Roundup - KTR Questions Modi Attitude

* బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? ..హైదరాబాద్‌కు అర్హత లేదా? అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం.. దేశం కోసం పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదన్నారు.

* అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి..తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోంది. వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు(స్వాతిమోహన్‌), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, నా ప్రసంగ ప్రతి రాసిన వినయ్ రెడ్డి అంతా భారతీయ అమెరికన్లే’ అని బైడెన్ అన్నారు. నాసా మార్స్ మిషన్ 2020(గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్‌)కు నాయకత్వం వహిస్తోన్న స్వాతి మోహన్ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

* కర్నూలు ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలను చేశారని బుగ్గన అన్నారు. వందేళ్లుగా తమ కుటుంబం మైనింగ్‌ రంగంలో ఉందన్నారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తానిప్పటికీ పాత కారే వాడుతున్నానని.. అపార్టుమెంట్‌లోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు.

* బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువగా అప్పులు చేసిన మాట వాస్తవమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాబడి విపరీతంగా తగ్గిపోయిందని.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యల కోసమే ప్రభుత్వం రూ.వందలకోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు.

* ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. కరోనా భయం పూర్తిగా తొలగిన తర్వాతే ఆన్‌లైన్‌ లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం అనంత‌రం జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంట‌ల ముందు కొవిడ్ ప‌రీక్ష చేయించుకుని స‌ర్టిఫికెట్ తీసుకువ‌స్తేనే అనుమ‌తిస్తామని స్పష్టం చేశారు.

* పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291మంది అభ్యర్థుల జాబితాను సీఎం మమతా బెనర్జీ గురువారం విడుదల చేశారు. ఈసారి నందిగ్రామ్‌ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు దీదీ స్పష్టంచేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ నుంచి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ను బరిలో దించుతున్నట్టు దీదీ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా.. 291 స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి మమత భారీ జాబితాను ప్రకటించారు. మిగతా మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు.

* తక్కువ ధరకే ఇంటర్నెట్‌, ఫీచర్‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి… రిలయన్స్‌ జియో భారత్‌ టెలికాం రంగంలో విప్లవాన్ని తెచ్చింది. రిలయన్స్‌ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్‌ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. ‘జియో బుక్‌’ పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు విపణిలోకి రావొచ్చు.

* విమానంలో విహరించాలన్నది ప్రతి సామాన్య మానవుడి కల. కానీ, ఆర్థిక స్థోమత అడ్డంకిగా మారి చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోరికను కొంతైనా నిజం చేసేందుకు వినూత్నంగా ప్రయత్నించారు పంజాబ్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌. రఫేల్‌ యుద్ధ విమానం డిజైన్‌తో ఓ వాహనాన్ని రూపొందించి కొందరి కలను కొంతైనా నిజం చేస్తున్నారు. భటిండాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రాంపాల్‌ బెహానివాల్‌ రఫేల్‌ యుద్ధ విమానం స్ఫూర్తితో అదే ఆకారంలో ఉన్న ఓ వాహనాన్ని రూపొందించారు. దానికి ‘పంజాబ్‌ రఫేల్‌’ అని పేరు పెట్టారు.

* ఆస్తి కోసం తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఎకంగా రక్తం పంచుకుని పుట్టిన అన్ననే చంపేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టంగుటూరు గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరు ఘర్షణకు దిగారు.