సేవా సంస్థల విజయవంతమైన కార్యక్రమాల వెనుక మూడు రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి రకం సొంత సమయాన్ని వెచ్చిస్తే….రెండో రకం సొంత సొమ్ములను….మూడో రకం బయటి నుండి నిధులను సమీకరించి సంస్థకు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తారు. ఈ మూడు విభిన్న గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు అయితే…అలాంటి అరుదైన వ్యక్తి ఒకే సంస్థలో క్రింది స్థాయి నుండి దశాబ్దానికి పైగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యవర్గ ముఖచిత్రంలో రుధిర వర్ణంగా అవతరించడం మరో అత్యంత అరుదైన విశేషం. ఆ అరుదైన వ్యక్తి ప్రకాశం జిల్లా పరుచూరు మండలం కొల్లావారిపాలెంకు చెందిన ఓహాయో రాష్ట్ర క్లీవ్‌ల్యాండ్ ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్‌బాబు అయితే….ఆ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా).
“ఈ విశ్వంలో సమయం అపరిమితం, అఖండం, అనంతం.సేవా సంస్థలకు సమయాన్ని ధారపోసేవారికి దాని మీద చింత ఉండదు. కానీ నిధులను వెచ్చించేవారికి లేదా విరాళంగా అందజేసేవారికి అది పరిమితమైన వస్తువు. అందుకే వారి కష్టార్జితాన్ని అందుకుంటున్నందుకు సంస్థ తన దాతలకు ఎల్లప్పుడూ ప్రథమ జవాబుదారీ. ఇలా వచ్చిన ప్రతిపైసాకు ఎంతో విలువ ఉంటుంది. ఆ సొమ్ములతో చేసే ఖర్చు ఈ విలువను మరింత పెంపొందించేది అయి ఉండాలి. రాబడికి-ఖర్చుకు మధ్య విలువ అనే వారధి ఉండాలి. తానా తదుపరి కోశాధికారిగా నన్ను గెలిపిస్తే ఈ లక్ష్యంతో సంస్థ ఆర్థిక విభాగంలో పారదర్శకతను ప్రోది చేస్తాను. సంస్థ నిధులు తమకు నిర్దేశించిన గమనంలో నుండి దారి మళ్లకుండా కాపలా కాస్తాను. ” అని 2021-23 కాలానికి గానూ నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుండి కోశాధికారి అభ్యర్థిగా బరిలో ఉన్న అశోక్‌బాబు TNIతో అన్నారు.
తల్లిదండ్రులు ఇరువురు వ్యవసాయం చేసే సామాన్య రైతు కుటుంబంలో 1985లో జన్మించిన అశోక్, 2007లో ఉన్నతవిద్య కోసం కెంటకీలోని ముర్రే స్టేట్ యూనివర్శిటీకి అమెరికాకు తొలిసారిగా వచ్చారు. అక్కడి భారతీయ విద్యార్థుల సంఘం ప్రతినిధిగా అశోక్ సేవా తత్పరతను గమనించిన తానా కార్యవర్గం 2009లో NRI విద్యార్థుల సేవా కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. 24ఏళ్ల వయస్సులో తానాలోకి ప్రవేశించిన అశోక్ సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల సమన్వయకర్తగా, టీం స్క్వేర్ ఉపాధ్యక్షుడిగా, టీంస్క్వేర్ అధ్యక్షుడిగా, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా, సహాయ కోశాధికారిగా, 2021 తానా ఎన్నికల నోటిఫికేషన్‌కు పూర్వం వరకు సహాయ కార్యదర్శిగా తానాలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అన్ని విభాగాల్లో అనుభవాన్ని గడించారు. అమెరికాలో ఆపన్నుల సహాయార్థం ఏర్పాటు చేసిన టీంస్క్వేర్‌కు వెన్నెముకగా వ్యవహరించి దాన్ని బలోపేతం చేసేందుకు కావల్సిన అన్ని సౌకర్యాలను సమన్వయపరచడంలో అశోక్ సేవలు అమూల్యమైనవి.
అమెరికాలో విద్యార్థుల కష్టాలు ఎరిగిన విద్యార్థిగా, ఇమ్మిగ్రేషన్ విషయాల్లో నిపుణుడిగా, భారత రాయబార కార్యాలయాల్లో మంచి పేరు కలిగిన ప్రతినిధిగా, పేదలకు అన్నదానం చేసే సహృదయుడిగా, తానా సేవా కార్యక్రమాలకు కార్పోరేట్ కంపెనీలతో పాటు దాతల నుండి భారీగా నిధులు సమీకరించే నిబద్ధత కలిగిన కార్యకర్తగా పలు పాత్రలు పోషించిన అశోక్….తానాలో ఆర్థిక విభాగ శోకాన్ని తాను తీరుస్తానని అంటున్నారు. జయరాం నుండి జయశేఖర్ వరకు ఎందరో అధ్యక్షుల సారథ్యంలో తాను తానా వేరు కాదని సేవ చేసిన అశోక్…ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి తాను గల్లీయువకుడినో, సిల్లీనాయకుడినో, ఫుల్లీ క్వాలిఫైడ్ సేవకుడినో నిర్ధారించాలని తానా ఓటర్లకు, సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇప్పటివరకు నిర్వర్తించిన పదవులు, సేవా కార్యక్రమాలు దిగువ చూడవచ్చు…..
* 2009-13: తానా ఎన్నారై విద్యార్థుల సేవా కమిటీ అధ్యక్షుడు.
* 2013-15: తానా టీంస్క్వేర్ పశ్చిమ విభాగ అధ్యక్షుడు, ఎన్నారై విద్యార్థుల సేవా కమిటీ ఉపాధ్యక్షుడు.
* 2015-17: తానా సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త, టీంస్క్వేర్ ఉపాధ్యక్షుడు.
* 2017-19: తానా సహాయ కోశాధికారి, టీంస్క్వేర్ ఉపాధ్యక్షుడు.
* 2019-21: తానా సహాయ కార్యదర్శి, టీంస్క్వేర్ అధ్యక్షుడు.
* 1-855-OUR-TANA ఆలోచనకు ఆద్యుడు, రూపకర్త.
* క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో గత అయిదేళ్లలో 5లక్షల భోజనాల పంపిణీ.
* నకిలీ విశ్వవిద్యాలయాల బారిన పడిన 10వేల మంది భారతీయ విద్యార్థులకు చేయూత.
* గత రెండేళ్లలో 500మంది మృతదేహాలు టీంస్క్వేర్ ద్వారా భారత్‌కు తరలింపు.
* కోవిద్ సమయంలో 5000 మంది విద్యార్థులకు సరుకుల పంపిణీ.
* అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వేలాది మందిని భారత రాయబార, కాన్సులేట్ కార్యాలయాలతో అనుసంధానించి వారి ఇమ్మిగ్రేషన్ అవసరాలను తీర్చడం.
* ప్రతి ఏడాది 15 చిన్నారులకు గుండె శస్త్రచిక్త్సలకు నిధులు అందజేత.
* 45 క్యాన్సర్ క్యాంపుల ద్వారా 380 మందికి క్యాన్సర్ గుర్తింపు.
తానాలో ఖర్చు అయ్యే ప్రతి పైసాకు విలువ ఉండాలి. అదే నా లక్ష్యం.-TNIతో కోశాధికారి అభ్యర్థి కొల్లా అశోక్‌బాబు
Related tags :