అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో ఉన్న ఈ సంచిక కవర్‌పేజీని ఆ పత్రిక నేడు ట్విటర్లో విడుదల చేసింది. ‘‘నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు’’ అనే శీర్షికతో టైమ్ ఈ కథనం ప్రచురించింది.
ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా.. ముందుండి నడిపిస్తున్న పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతుల అనుభవాలు, బాధలను ఈ కవర్‌స్టోరీలో రాసుకొచ్చింది. నూతన సాగు చట్టాలపై మాత్రమే కాకుండా.. పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
కేంద్రం తీసుకొచ్చిన సూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 100 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనేక మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వెన్నుచూపకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా కిసాన్ దివస్’గా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.
అన్నదాతల ఉద్యమానికి ఇప్పటికే అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం అప్పట్లో దుమారం రేపింది.