* ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ (72) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది. దీంతో ఎంజీ జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాయి. 1949,నవంరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్ ముత్తూట్. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. మూడో తరానికి చెందిన వారు. 1979లో మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్ గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. ఆయనకు భార్య సారా జార్జ్, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ఈ బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాగా రెండవ కుమారుడు పాల్ ముథూట్ జార్జ్ 2009 లో హత్యకు గురయ్యారు. కాగా దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా జార్జ్ ముత్తూట్ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ ఆసియా మ్యాగజీన్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020 నాటికి ర్యాంకింగ్ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.
* గత ఏడాది భారీ సంపదను పోగేసి రికార్డు సృష్టించిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. గడిచిన వారం రోజుల్లో చతికిలపడ్డారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన సంపద ఏకంగా 27 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం 156.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ కంటే మస్క్ సంపద 20 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది.
* మార్చి 3 న ప్రారంభమైన ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఐపీఓ గురువారం సాయంత్రం 5 గంటల వరకు 200.65 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ప్రారంభ వాటా అమ్మకం కోసం ఈక్విటీ షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ. 574-575 గా నిర్ణయించారు. ఐపీఓ ముందు, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ. 179 కోట్లు వసూలు చేసింది.
* రుణగ్రహీత ఉన్నత చదువుల కోసం తీసుకున్న విద్యా రుణంలో వడ్డీపై సెక్షన్ 80ఈ కింద మినహాయింపు పొందవచ్చు. విద్యార్థి, లేదా దగ్గరి బంధువు – జీవిత భాగస్వామి, పిల్లలు లేదా చట్టపరమైన సంరక్షకుడు – ఎనిమిది సంవత్సరాల వరకు ఈ మినహాయింపు పొందవచ్చు.
* ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు ఐటీ విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. కరోనా సంక్షోభ కాలంలో ఐటీ రంగం సానుకూల ఫలితాల్ని నమోదు చేసినట్లు తెలిపింది. 165 ఐటీ కంపెనీల విక్రయాలు డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,05,724 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఐటీ ఉత్పత్తుల అమ్మకాల విలువ రూ.1,01,001 కోట్లుగా ఉంది. ప్రైవేటు రంగంలోని 2,692 ఆర్థికేతర సంస్థల త్రైమాసిక ఫలితాల్ని పరిశీలించి ఆర్‌బీఐ ఈ నివేదిక రూపొందించింది.
* కొవిడ్ మహమ్మారి సమయంలో మహిళలు, సామాజికంగా వెనుకబడిన ఇతర వర్గాలు ఎక్కువగా నష్టపోతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. సంఘటిత ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయకపోవడం, లింగ వైవిధ్యం లేకపోవడంతో ప్రస్తుత డాలర్ రేటు వద్ద ఈ అంతరం పూరించడానికి 257 ఏళ్లు పట్టవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌లోని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. లింగ సమానత సాధించనందున ప్రపంచానికి 1990 నుంచి ఇప్పటివరకు 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో లింగ సమానత సాధించగలిగితే ఇది ప్రపంచ జీడీపీని 2025 కల్లా 28 లక్షల కోట్ల డాలర్లకు పెంచుతుందని తెలిపారు. లింగ అసమానత వల్ల మానవ మూలధన సంపద 160.2 లక్షల కోట్ల డాలర్ల మేర కోల్పోతుందని అంచనా వేశారు. మహమ్మారి సమయంలో మహిళలు లక్ష కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారని వివరించారు. ‘విద్య, ఉపాధిలో లింగ, జాతి అంతరాలను పట్టించుకోకపోవడంతో 2019లో 2.6 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ఉత్పత్తి పెరిగడం గమనార్హం.