* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 115 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో చిత్తూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,556కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,173కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,462కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 921 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,41,90,477 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ షెడ్యూల్ ఖారారైంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎంసెట్ కమిటీ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆలస్య రుసుంతో జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది.
* తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యలు, ఇతర ఉన్నఅధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన సంబంధిత అంశాలపై సమీక్షిస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది రోజుల పాటు సమావేశాలు జరగవచ్చని సమాచారం.
* విజయవాడ తెలుగుదేశం నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో నేతల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. విజయవాడలో తెదేపా నేతల మధ్య తలెత్తిన విభేదాలపై తెలిసిన వెంటనే అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్దన్, వర్ల రామయ్యలు మాట్లాడారు. విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని శ్వేతకు మద్దతిస్తూ, ఆమె వెంటే ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని నేతలు హామీ ఇచ్చారు. ఆమె విజయానికి కృషి చేస్తామని ముగ్గురు నేతలు వెల్లడించారు.
* తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, అన్నాడీఎంకేల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తులో భాగంగా భాజపాకు అధికార అన్నాడీఎంకే 20 స్థానాలు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు పార్టీల సీనియర్ నేతలు సంతకాలు చేశారు. అన్నాడీఎంకే తరపున పార్టీ కోఆర్డినేటర్, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, సీఎం ఈ పళనిస్వామి, భాజపా తరపున రాష్ట్ర ఇన్‌ఛార్జి సీటీ రవి, స్టేట్ యూనిట్ చీఫ్ మురుగన్ సంతకం చేశారు. మరో ప్రాంతీయ పార్టీ అయిన పీఎంకేకు పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 23 స్థానాలు కేటాయించింది.
* భాజపా వల్లే వరంగల్ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. వరంగల్‌కు రింగురోడ్‌ను కూడా భాజపా ప్రభుత్వమే కేటాయించిందని చెప్పారు. హన్మకొండలో పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై భాజపా శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. అమృత్ సిటీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ కింద వరంగల్‌కు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
* వైకాపా ప్రభుత్వానికి చెక్‌పెట్టే ఏకైక పార్టీ భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప విచ్చేసిన ఆయన.. నగరంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు మొదలుకొని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ మొత్తం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.
* ప్రతికూల పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని స్థాపించారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస విద్యార్థి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 27 నాటికి తెలంగాణ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతుందన్నారు. పార్టీని స్థాపించిన సమయంలో కేసీఆర్‌కు మీడియా, మనీ, మజిల్ పవర్ ఏమీ లేదని గుర్తు చేశారు. నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణను సాధించారని కొనియాడారు. అయితే కొందరు సీఎం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని కేటీఆర్ హెచ్చరించారు.
* విజయవాడ తెలుగుదేశం నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో నేతల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. విజయవాడలో తెదేపా నేతల మధ్య తలెత్తిన విభేదాలపై తెలిసిన వెంటనే అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్దన్, వర్ల రామయ్యలు మాట్లాడారు.
* పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సెనేట్ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాక్ పార్లమెంట్ విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శనివారం దిగువ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించగా.. ఇమ్రాన్ ఖాన్ 178 ఓట్లతో విజయం సాధించారు. దిగువ సభలో మొత్తం 342 సభ్యులకు గాను.. నెగ్గడానికి 172 ఓట్లు అవసరం. అయితే, ఇమ్రాన్‌కు అనుకూలంగా 178 మంది ఓటు వేశారు. దీంతో విశ్వాస పరీక్ష నుంచి ఇమ్రాన్ గట్టెక్కినట్లైంది.
* ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించింది. కోహ్లీసేన 365 పరుగులకు ఆలౌటవ్వడంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 135 పరుగులకే చాపచుట్టేసింది. టీమ్‌ఇండియా ఆధిక్యమైన 160 పరుగులనూ సమం చేయలేకపోయింది. 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
* కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య 2 కోట్లకు చేరువకాగా.. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో దాదాపు 15లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీలో భాగంగా 49వ రోజైన శుక్రవారం దేశవ్యాప్తంగా 14,92,201 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో 11,99,848 మంది తొలి డోసు తీసుకోగా.. 2,92,353 మందికి రెండో డోసు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1.94కోట్లు దాటింది.
* అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందో నవ వధువు. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనేపుర్‌లో చోటుచేసుకుంది. జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోజీకి బాలాంగిర్ జిల్లా తెటెల్‌గావ్ గ్రామానికి చెందిన బిశికేశన్‌తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం వధువు కుటుంబసభ్యులు కూతుర్ని అత్తవారింటికి సాగనంపేందుకు ‘బిదాయి(అప్పగింతలు)’ జరుపుతుండగా.. రోజీ ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చిఏడ్చి ఉన్నట్టుండి కుప్పకూలింది.
* బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు దాడి కలకలం సృష్టించింది. గోసబా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బృందంపై నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అయితే దాడిలో గాయపడిన వారంతా భాజపా కార్యకర్తలుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన కార్యకర్తలు కొందరు శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై నాటు బాంబు విసిరారు. పేలుడు ధాటికి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* కొత్త అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరువైన ఈ మెసేజింగ్ యాప్‌లో త్వరలో మరో అప్‌డేట్‌తో రానుంది. ఇప్పటికే ఉన్న డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌లోనే మరో సదుపాయాన్ని చేర్చింది. ఇప్పుడు ఉన్న ఫీచర్ ఆధారంగా మెసేజులు వారం రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. కానీ, 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అయిపోయే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్ తన ట్విటర్ ఖాతాలో తెలిపింది.