అమెరికా పౌరుడు, క్రీడాకారుడు, తానాలో తదుపరి తరానికి చెందిన యార్లగడ్డ శశాంక్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 2021-23కు గానూ క్రీడా కార్యక్రమాల సమన్వయకర్తగా నిరంజన్ ప్యానెల్ నుండి బరిలో ఉన్న ఆయన తన తెలుగు ప్రసంగాలతో ఎన్నికల ప్రచారంలో ప్రవాసులను, తానా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, యువకుడిగా మంచి అనుభవం ఉండటం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నానని, తాను ఏ ప్రచార కార్యక్రమానికి వెళ్లినా స్థానిక యువత కొందరు తనను కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చి తనను అభినందిస్తున్నారని, తానా గురించి వాకబు చేస్తున్నారని, వారిలో కూడా తానా పట్ల స్ఫూర్తి రగిలించడం ఆనందంగా ఉందని శశాంక్ పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన మరింత సమాచారం దిగువ చూడవచ్చు….
తానాలో సహజంగా ఇండియా నుండి అమెరికాకు ఉద్యోగాలు, ఉన్నత చదువుల నిమిత్తం వచ్చి పదవులను అధిరోహించే వారి సంఖ్య అధికం. ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్ యువత కోసం తానాలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలు, మహాసభల్లో ప్రత్యేక సమావేశాలు ఉన్నప్పటికీ తానా కార్యవర్గంలో గానీ ఫౌండేషన్‌లో గానీ బోర్డులో గానీ వీరు పదవులను అధిరోహించిన దాఖలాలు తానా 44 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేవు. ఈ సంస్కృతికి చరమగీతం పాడుతూ, అమెరికాలోని ప్రవాస తెలుగు యువతను తానా వైపు నడిపేందుకు, క్రీడాపరమైన కార్యక్రమాలు తానాలో ముమ్మరంగా చేపట్టే లక్ష్యాలతో క్రీడల సమన్వయకర్త పదవికి 2021 ఎన్నికల్లో తలపడుతున్నానని యార్లగడ్డ శశాంక్ TNIతో అన్నారు. ప్రవాస తెలుగు యువతగా, తదుపరి తరానికి చెందినవాడిగా తానా కార్యవర్గంలోకి ప్రవేశించే తొలి వ్యక్తిగానే గాక మరెందరో ఔత్సాహికులకు తాను ప్రేరణగా నిలబడతాననే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో క్రీడల సమన్వయకర్తగా పోటీ చేస్తున్నానని శశాంక్ పేర్కొన్నారు.
చికాగోలో హైస్కూల్ విద్యను, జాక్సన్ మిస్సిస్సిప్పిలో కాలేజీ విద్యను అభ్యసించిన శశాంక్ రెండు చోట్ల క్రికెట్, అమెరికన్ ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో సత్తా చాటారు. జాక్సన్ విశ్వవిద్యాలయ క్రికెట్ జట్టులోనే గాక స్థానిక జట్లలో కూడా శశాంక్ ఉత్సాహవంతమైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 2019 నుండి తానా యువనాయకత్వ ప్రోత్సాహక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన క్రీడల సమన్వయకర్తగా తనను గెలిపిస్తే తానా వైపు అమెరికాలోని ప్రవాస తెలుగు యువత ఆకర్షితులయ్యే విధంగా క్రీడా కార్యక్రమాలను రూపొందిస్తానని అన్నారు. ఘనమైన తానా గత చరిత్ర తనకు సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని కలిగించిందని శశాంక్ అన్నారు. ఈ నవతరం యువకెరటానికి #TANA4CHANGE నినాదంతో ఎన్నికల బరిలో దూసుకెళ్తున్న నిరంజన్ శృంగవరపు ప్యానెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. శశాంక్ లాంటి యువ ప్రవాస క్రీడాకారులను తానా ఆలింగనం చేసుకోవడం ఒక నూతన శకానికి నాంది కాగలదని వారు అభిలషిస్తున్నారు. శశాంక్ క్రీడా అనుభవాలు, విద్యాభ్యాసం, తన భవిష్యత్ ప్రణాళికలు తదితర విషయాలు దిగువ చూడవచ్చు.
* 2019: తానా యువనాయకత్వ ప్రోత్సాహక కమిటీ ఉపాధ్యక్షుడు
* హైస్కూల్ విద్య: నేపర్‌విల్ నార్త్ హైస్కూల్.
* కాలేజీ: జాక్సన్ విశ్వవిద్యాలయం, మిస్సిస్సిప్పి.
* క్రీడల అనుభవం: హైస్కూల్‌లో అమెరికన్ ఫుట్‌బాల్, కాలేజీలో అమెరికన్ ఫుట్‌బాల్, క్రికెట్ జట్లలో సభ్యుడు.
* స్థానికంగా తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ, బ్యాక్‌ప్యాక్‌ల వితరణ.
* ఇండియాతో పాటు అమెరికాలోని అత్యవసర సిబ్బందికి కోవిద్ సమయంలో మాస్కులు అందజేత.
* D-I విభాగంలో హైస్కూల్ కాలేజీల్లో అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు
* స్థానికంగా ఉన్న పలు క్రికెట్ జట్టులో సభ్యుడు, అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలను సైతం నిర్వహించిన అనుభవం.
* జాక్సన్ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థుల సంఘంతో పాటు అదే విశ్వవిద్యాలయంలోని తెలుగు సంఘంలో క్రియాశీలక సభ్యుడు.
అమెరికన్ తెలుగు యువతను తానా వైపు నడిపిస్తా-TNIతో శశాంక్ యార్లగడ్డ.
తానా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న యార్లగడ్డ శశాంక్
Related tags :