Devotional

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి

The history and importance of sreekalahasthi

దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొంది… భక్తకోటిని పునీతులను చేస్తున్న దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన స్వామి స్వయంభువుగా పూజలందుకొంటున్న పుణ్యస్థలం. పరమశివుడు వాయులింగ రూపంలో వెలుగొందుతున్న ఏకైక ఆలయం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువు ఫణి రూప లింగాకారంలో దర్శనమిస్తారు. సృష్టికర్త మొదలు ఆటవికుడు, సాలీడు, సర్పం, ఏనుగు దాక ఈ లింగరూప భవుని సేవించి కోర్కెలు ఫలింపచేసుకున్నాయి.
*పందిళ్లు వేసిన సాలెపురుగు…
కృతయుగంలో సాలెపురుగు కొండ మీద శివలింగానికి చుట్టూ తన దారాలతో అర్చన చేసి పందిళ్లు కట్టింది. పొద్దుటే వాటిపై మంచు బిందువులు పడి, అవి ముత్యాల పందిళ్ల వలె కనిపించేవి. ఒకరోజు దాని భక్తిని పరీక్షించాలనుకొంటాడు శివుడు. పక్కనే ఉన్న దీపంతో ఆ సాలీడు నిర్మించిన పందిళ్లు తగలబడిపోయేలా చేస్తాడు. అది చూసి తట్టుకోలేని సాలీడు దీపాన్ని మింగి చనిపోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. శివైక్యం కోరుకుంటుందా సాలీడు. పరమేశ్వరుడు అంగీకరిస్తాడు. అలాగే పాము… అది పాతాళ లోకం నుంచి మణిమాణిక్యాలు తెచ్చి లింగార్చన చేసేది. అది త్రేతాయుగాంతం. ద్వాపరయుగం ప్రవేశించింది. ఆ శివలింగాన్ని పూజించడానికి ఒక ఏనుగు వచ్చింది. అది రోజూ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి మారేడు దళాలు, పూలు తెచ్చేది. శివలింగంపై ఉన్న మణులు తోసివేసి తాను తెచ్చిన పూజాద్రవ్యాలతో అర్చించేది. ఉదయం వచ్చిన సర్పం ఏనుగు పూజించిన ద్రవ్యాలు తొలగించి మణులతో అర్చన చేసేది.
*** ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పాము అక్కడే ఒకపక్కన దాగివుంది. ఏనుగు వచ్చింది. తొండంతో నీళ్లు తెచ్చి శివలింగంపై పోసి పూలతో పూజించింది. ఇంతలో అక్కడే ఉన్న పాము కోపంతో ఏనుగు తొండంలోకి జొరబడి కుంభస్థలంలోకి చేరింది. ఏనుగు తల తిరిగింది. తన కుంభస్థలాన్ని కొండకు ఢీకొట్టింది. కుంభస్థలం పగిలిపోయింది. పాము విగతజీవి అయింది. ఏనుగూ మరణించింది. శివుని కటాక్షంతో తరువాత ఆ రెండు జీవాలు లింగంలో ఐక్యమయ్యాయి. రుద్రగణంలో చేరిపోయాయి. అలా ‘శ్రీ-కాళ-హస్తి’ల పేర్లతో శ్రీకాళహస్తిగా స్థిరపడింది. ఆ మూడు మూగజీవుల పేరుతో శివుడు శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకొంటున్నాడు.
**రాహు-కేతు క్షేత్రంగా ఖ్యాతి
శ్రీకాళహస్తి క్షేత్రం తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ రాహు, కేతువులు ఉండడంవల్ల గ్రహణ సమయాల్లో సైతం గుడి తెరిచే ఉంటుంది. ఈ క్షేత్రంలో ముక్కంటి నవగ్రహ కవచాన్ని నిత్యం ధరించి ఉంటాడు. అందుకే ఆయనకు గ్రహణ దోషాలు కలగవు. గ్రహణ సమయంలో ఇక్కడ సర్వాభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడి శిరస్సు భాగాన సర్పాకారం, మధ్యలో ఏనుగు దంతాలు, అడుగు భాగంలో సాలీడు చిహ్నాలు కనిపిస్తుంటాయి.