* ఓలా.. భారత్ మొబిలిటీ సేవల్లో ఓ సంచలనం. ఇప్పుడు మరో రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని ఏళ్లలో శిలాజ ఇంధనాల శకం ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్తంతా స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలదే కానుంది. ఈ మార్పుని ‘ఓలా ఎలక్ట్రిక్’ ఓ అవకాశంగా మలచుకునేందుకు సిద్ధమైంది. భారత్ కేంద్రంగా ప్రపంచ విద్యుత్తు వాహన విపణిపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా ఇప్పటికే బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్రపరిధిలోని ప్రాంతంలో ‘ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’కి పునాది రాయి వేసింది. కంపెనీ కార్యనిర్వణాధ్యక్షుడు(సీఈవో) భవిష్ అగర్వాల్ వారాంతంలో ఇక్కడే గడుపుతూ ‘మరో చరిత్ర’కు మార్గనిర్దేశం చేస్తున్నారు.
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మహిళా రుణగ్రహీతలకు గృహ రుణ రేట్లపై వడ్డీపై మరింత తగ్గింపును ప్రకటించింది. మహిళా దినోత్సవం రోజున, మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది, 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్న వడ్డీ రేట్లపై ఇది వర్తిస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి స్వల్పంగా కోలుకొని లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం 50,654 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 50,985 వద్ద గరిష్ఠాన్ని.. 50,318 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 35 పాయింట్లు లాభపడి 50,441 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,002 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,111 – 14,919 మధ్య కదలాడి చివరకు 18 పాయింట్ల స్వల్పలాభంతో 14,956 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.21 వద్ద నిలిచింది.
* దేశంలో 18-25 ఏళ్ల వయసున్న యువ మహిళా మదుపర్లు నష్టభయం ఉన్నా, అధిక ఆర్జనకు వీలున్న ఆర్థిక సాధానాల్లోనే పెట్టుబడులకు ఉత్సుకత చూపుతున్నారని గ్రో సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి పథకాల కంటే అధిక రాబడినిచ్చే స్టాక్‌ల వైపు మొగ్గు చూపుతున్న యువత మూడు రెట్లు ఉన్నారని పేర్కొంది. 28,000 మంది మహిళలను సర్వే చేసి, వారి పెట్టుబడి లక్ష్యాలను తెలుసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
* మహిళలకు జీవితంలో చేరుకోవాల్సిన వేర్వేరు మైలురాళ్ళు ఉంటాయి. ఇప్పుడు చాలావరకు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో వారు కూడా ఆర్థిక నియంత్రణను పాటించడం చాలా ముఖ్యం. మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల ఆర్థిక పరిస్థితులను చక్కగా నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలను ఆర్థిక నిపుణులు అందించారు.మనలో చాలా మందికి డబ్బు నిర్వహణ చాలా కష్టమైన పని. మహిళలకు ఇది మరింత కష్టంగా భావిస్తారు. మహిళలు తమ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలని సలహాదారుల సూచన. అవి స్వేచ్ఛ, కోరిక, అవసరం.మొదట ఆర్థిక స్వేచ్ఛ కోసం డబ్బును కూడబెట్టుకోవడం ప్రారంభించండి, అంటే దీర్ఘకాలిక లక్ష్యాలైన పదవీ విరమణ వంటి లక్ష్యాల కోసం దాచుకోండి. మీ ఆదాయంలో కనీసం 20 శాతం దీనికి కేటాయించాలి. ఈ డబ్బును మళ్లీ తీసుకునే అవసరం ఉండకూడదు. తరువాత, మీ కోసం డబ్బును కేటాయించండి. మీకు సంతోషాన్నిచ్చే ఏమైనా ఖర్చు చేయడానికి కనీసం 10 శాతం కేటాయించవచ్చు. చివరిది ముఖ్యమైనది అవసరాలు. ఇది సాధారణంగా నెలవారీ ఖర్చుల్లోకి వస్తాయి. మీ నిత్యావసరాల తర్వాత ఇంకా ఏమైనా డబ్బు మిగిలితే తిరిగి ఆర్థిక స్వేచ్ఛ వైపు కేటాయించాలి.ఆదాయం పెరిగే కొద్దీ ఈ విభాగంలో కేటాయింపులు కూడా పెరగాలి. ఈ విధంగా, మీరు మీ ప్రస్తుత అవసరాలకు రాజీ పడకుండా మీ భవిష్యత్తు కోసం ప్రణాళికతో ఉండాలి. ఇలా విచక్షణతో ఖర్చు చేస్తే తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.
* 760 కోట్ల అనుపమ్ రసాయన్ ఇండియా లిమిటెడ్ ‘ఐపీఓ’ ఈ మార్చి 12న ప్రారంభమవుతుంది. ఇష్యూ ధర రూ. 553-555గా నిర్ణయించారు. ఈ ఆఫర్ ఈ మార్చి 16న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో రూ. 556.20 కోట్లు సంస్థకున్న రుణాన్ని తీర్చడానికి ఉపయోగించాలని కంపెనీ యోచన. సెప్టెంబర్ నాటికి కంపెనీకి మొత్తం అప్పు రూ. 814.48 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో నుంచి 6 నెలల కాలంలో రూ. 26.5 కోట్ల లాభం.. అనుపమ్ రసాయన్ కంపెనీ నమోదు చేసింది. క్రితం ఏడాది లాభం రూ. 21.74 కోట్లు మాత్రమే. ఈ కాలానికి ఆదాయం 51.5% పెరిగి రూ. 355.13 కోట్లకు చేరుకుంది.