Politics

19 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు-తాజావార్తలు

19 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు-తాజావార్తలు

* ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది.మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి.ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించా లని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది.మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రెడీ చేస్తోంది.

* ఉత్తరాఖండ్​….ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​.. తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు గవర్నర్​కు లేఖ పంపారు.సొంత పార్టీలో త్రివేంద్ర సింగ్​కు అసమ్మతి సెగ తగిలింది.మంత్రులతో పాటు 20మంది ఎమ్మెల్యేలు.. రావత్​పై గత వారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో.. ఉత్తరాఖండ్​ భాజపాలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ.. ఈ నెల 8న నివేదికను అధిష్ఠానానికి సమర్పించింది.అయితే నాయకత్వం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అందరూ భావించారు. కానీ మంగళవారం త్రివేంద్ర అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు.సీఎం రేసులో రాష్ట్ర మంత్రి ధన్​ సింగ్​ రావత్​, ఎంపీలు అజయ్​ భట్​, అనిల్​ బలుని ఉన్నట్టు తెలుస్తోంది.ఓ డిప్యూటీ సీఎంను కూడా నియమించే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.పుష్కర్​ సింగ్​ ధమికి ఆ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

* భారత్-బంగ్లాదేశ్​ను కలుపుతూ ఫెనీ నదిపై నిర్మించిన ‘మైత్రి సేతు’ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ వంతెన ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు.ఒకప్పుడు సమ్మె సంస్కృతి కారణంగా వెనుకంజలో ఉన్న త్రిపుర.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలు(రెండు చోట్ల భాజపా) అధికారంలో ఉన్నందున సులభతర వాణిజ్యం దిశగా సాగుతోందని చెప్పారు. మూడేళ్లలోనే ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని తెలిపారు.డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం అధికారంలో లేని రాష్ట్రాల్లో పేదలను శక్తిమంతం చేసే విధానాలు అమలుకు నోచుకోకపోవడమో, లేక అభివృద్ధి మందగమనంలో సాగుతుండటమో జరుగుతుందని మోదీ అన్నారు.

* ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసే తాను నందిగ్రామ్​ నుంచి ఎన్నికల బరిలో దిగినట్టు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

* ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం.రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై సీఎం సమీక్ష.ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని సీఎం ఆదేశం.ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు ఆదేశం.కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ యూనిట్లను వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్న సీఎం.సత్వరమే నిర్మాణాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందన్న సీఎం.వేసవి దృష్ట్యా విద్యుత్‌ ఉత్పత్తిపై సీఎం సమీక్ష.

* అనంతపురం జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి చెందిన ఫిజియోథెరపీ క్లినిక్ పై వైద్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ సంఘటన రాయదుర్గం పట్టణంలో సంచలనం కలిగిస్తోంది.రాయదుర్గం మున్సిపాలిటీలో 29వ వార్డు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది.అయితే ఈ క్లినిక్‌లో అడిషనల్ డీఎంహెచ్ఓ రామ సుబ్బారావు తనిఖీలు చేశారు.సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఫిజియోథెరపీ క్లినిక్‌లో తనిఖీ చేసినట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిల్‌లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తికి చెందిన ఫిజియోథెరపీ క్లినిక్ పై అధికారులు దాడులు నిర్వహించడం దారుణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

* ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారు. ఇంకా 1,038 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైంది.

* ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఓటు వేయనున్నారు. పవన్ కల్యాణ్ పటమటలంకలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

* ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటరుగా నమోదు అయిన గవర్నర్ దంపతులు బుధవారం జరిగే విజయవాడ నగర పాలక సంస్ధ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేయనున్నారు. గవర్నర్ పేట నగర న్యాయ స్దానముల ప్రాంగణానికి ఎదురుగా రాజ్ భవన్ కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ నగర పాలక ఉన్నత పాఠశాల (సివిఆర్ జిఎంసి హైస్కూల్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ఉదయం 11గంటల ప్రాంతంలో గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ లు ఓటు హక్కును వినియోగించుకుంటారని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగనీయని రీతిలో రాజ్ భవన్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.

* మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని మెజార్టీ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.