తానా 2021 ఎన్నికల్లో ప్రచార వేడి పెరుగుతోంది. పోటీలో ఉన్న ప్యానెళ్ల అభ్యర్థులు అమెరికా అంతటా సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. ఈ క్రమంలో న్యూజెర్సీ, బోస్టన్‌లలో ప్రచారాన్ని ముగించిన అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన కొడాలి నరేన్ ప్యానెల్ సోమవారం నాడు మేరీల్యాండ్‌లో పర్యటించింది. స్థానిక APTA, వారధి సంస్థల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొడాలి నరేన్, ఆయన ప్యానెల్ అభ్యర్థులు గుడిసేవ విజయ్, ఉప్పలపాటి అనీల్, మన్నే సత్యనారాయణలు పాల్గొన్నారు. విద్యాధికుడైన నరేన్ వంటి నాయకుడి అవసరం తానాకు ఉందని కార్యక్రమానికి హాజరయిన వక్తలు అభిప్రాయపడ్డారు. నరేన్ ప్యానెల్‌కు తమ మద్దతు ప్రకటించారు. నరేన్ మాట్లాడుతూ తానాను సరైన దిశలో నడిపించడానికి తన నాయకత్వంలోని ప్యానెల్ కట్టుబడి ఉందని, DMV ప్రాంతానికి చెందిన తన నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. అనంతరం BODకి పోటీ పడుతున్న గుడిసేవ విజయ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే BOD పర్యవేక్షణలో పనిచేసే మూడు కీలకమైన ఎన్నికల కమిటీ, సభ్యత్వ కమిటీ, పెట్టుబడుల కమిటీలను పటిష్ఠపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. తానా బోర్డుకు తన వంతుగా బలాన్ని చేకూరుస్తానని తెలిపారు. స్థానిక తెలుగు సంఘాల నుండి పుష్యమి, శ్రవణ, చందూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
########