Business

ఉద్యోగులకు ICICI తీపికబురు-వాణిజ్యం

ICICI To Bear Employee Vaccination Expense-Business News

* కరోనా మహమ్మారి తర్వాత జీవిత బీమాపై అవగాహన పెంచుకోవడంతో పాటు కొత్తగా పాలసీలు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. 24 జీవిత బీమా సంస్థలకూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ప్రీమియం వసూళ్లు 21శాతం పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరాయి. 2020 ఫిబ్రవరిలో ఇలా వసూలైన రూ.18,533.19 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం అధికం. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ రూ.12,920.57 కోట్ల తొలి ప్రీమియాన్ని వసూలు చేసి, అగ్రస్థానంలో నిలిచింది. 2020 ఇదేనెల ప్రీమియం రూ.10,404.68 కోట్లతో పోలిస్తే.. 24.18శాతం వృద్ధి లభించింది. మిగతా 23 బీమా సంస్థలూ కలిసి రూ.9,504.64 కోట్లు వసూలు చేశాయి. 2020 ఫిబ్రవరిలో ఇవన్నీ కలిపి వసూలు చేసిన రూ.8,128.51 కోట్లతో పోలిస్తే ఇది 16.93% అధికం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రూ.1,895.94 కోట్లు, ఎస్‌బీఐ లైఫ్‌ రూ.1,750.73 కోట్లు వసూలు చేశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 19% క్షీణతతో రూ.1,737.03 కోట్లకు పరిమితమైంది.

* ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ ఖర్చును తామే భరించనున్నామని ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ ప్రకటించింది. సుమారు లక్ష మంది వరకు ఉండే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సిన్‌ ఖర్చును భరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడే కుటుంబ సభ్యుల రక్షణార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

* క్రెడిట్ కార్డ్ అనేది వ్యక్తిగత రుణం లాంటిది, ఇది వినియోగదారులకు సులభంగా లభిస్తుంది. క్రెడిట్ కార్డులుతో వ‌స్తువులు కొనుగోలు చేసిన‌ప్పుడు లావాదేవీల సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ముందుగా వస్తువులను కొనుగోలు చేసి తరువాత నెల‌వారిగా చెల్లించే స‌దుపాయం కూడా ఉంది. అయినప్పటికీ, వడ్డీ వ్యయం పరంగా రుణం తీసుకోవటానికి ఇవి చాలా ఖరీద‌నే చెప్పుకోవాలి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల షేర్లు బలహీనపడడంతో మధ్యాహ్నం కాస్త నేల చూపులు చూశాయి. కొద్ది సేపటి తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి పుంజుకున్నాయి. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,430 వద్ద గరిష్ఠాన్ని.. 51,048 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 254 పాయింట్లు లాభపడి 51,279 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,202 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,218 వద్ద గరిష్ఠాన్ని.. 15,100 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 69 పాయింట్ల లాభంతో 15,167 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.90 వద్ద నిలిచింది.

* ఫిబ్రవరిలో ప్రయాణికుల వాహనాల(పీవీ) రిటైల్‌ విక్రయాలు 10.59 శాతం పెరిగి 2,54,058కు చేరాయి. 2020 ఇదే నెలలో తక్కువ అమ్మకాల నేపథ్యంలోనే ఈ పెరుగుదల కనిపించిందని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) మంగళవారం తెలిపింది. ఇదే సమయంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 13,00,364 నుంచి 16.08% క్షీణించి 10,91,288కు పరిమితయ్యాయి.