Politics

విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు-తాజావార్తలు

KTR Supports Cancellation Of Privatizing Vizag Steel

* విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతామన్నారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేలా ఉందని విమర్శించారు.

* ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. వరంగల్‌ ఎంతోమంది ఉద్యమకారులను అందించిన పురిటిగడ్డ అని చెప్పారు. జయశంకర్‌తో పాటు కాళోజీ, దాశరథి తదితర పెద్దలు ఇక్కడి వారేనని గుర్తు చేశారు. 2011లో ఇదే రోజున (మార్చి 10) ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మిలియన్‌ మార్చ్‌ ప్రపంచానికి అద్భుతంగా చాటిచెప్పిందన్నారు. అనంతరం జిల్లాలోని ప్రధాన సమస్యలను షర్మిల ప్రస్తావించారు. కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ అయ్యేట్టు ఉందా? వరంగల్‌ స్మార్ట్‌ సిటీ అయిందా? కాకతీయ వర్సిటీకి వీసీ ఉన్నారా?అని ప్రశ్నించారు. విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఇప్పటి పాలకులు విద్యార్థుల బలిదానాలపై అధికారంలోకి వచ్చారని.. అలాంటిది విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం బాధాకరమన్నారు.

* కరోనా వైరస్ మహారాష్ట్రను కలవరపెడుతోంది. లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విజృంభణను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ లేక కఠిన నిబంధనల గురించి శివసేన పార్టీ పత్రిక సామ్నా ముందస్తు హెచ్చరిక చేసింది. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు వద్దనుకుంటే క్రమశిక్షణతో వ్యవహరించాలని తేల్చిచెప్పింది. లాక్‌డౌన్‌పై స్థానిక యంత్రాంగం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అస్లామ్ షేక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

* పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్‌ను విస్మరించలేమని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ స్పష్టం చేశాడు. దేశానికి ఆడటం గర్వకారణమేనని తెలిపాడు. కొన్నిసార్లు రెండింటి మధ్య సమతూకం కష్టమేనని అంగీకరించాడు. ఐపీఎల్‌ కోసం కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకోవచ్చన్న విమర్శల నేపథ్యంలో అతడు మాట్లాడాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు బట్లర్‌ కీలక ఆటగాడన్న సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియాతో తొలి టెస్టు తర్వాత బట్లర్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్‌ పూర్తయ్యాక తిరిగొచ్చాడు. ఇక ఐపీఎల్‌ ముగిసేంత వరకు భారత్‌లోనే ఉంటాడు. జూన్‌ 2న న్యూజిలాండ్‌తో సిరీస్‌ మొదలవుతుంది. మే నెలాఖరుకే ఐపీఎల్‌ ముగుస్తున్నా ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు చేరితే కీలక ఆటగాళ్లు వదిలివెళ్లడం కష్టం. బయో బుడగల్లో వారం రోజులు ముందునుంచే ఉండాల్సి రావడమే ఇందుకు కారణం. క్రికెటర్లు ఇలా ఐపీఎల్‌ కోసం భారత్‌లో ఉండిపోవడాన్ని బ్రిటిష్‌ మీడియా విమర్శిస్తోంది.

* విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు రాజీనామాలే అస్ర్తమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినా రాజీనామాలపై అధికార పార్టీ నేతలు ఇంకా ఆలోచించడాన్ని ఆయన తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో జగన్‌ ప్రత్యేక హోదా విషయంలో తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. రాజీనామాల వల్ల ఉపయోగం లేకపోతే ఆనాడు రాజీనామాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందన్నారు. ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేసి ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు.

* హరియాణాలో మనోహర్‌లాల్‌ నేతృత్వంలోని భాజపా- జేజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 31 మంది సభ్యులు ఓటేయగా.. 55 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో ఖట్టర్‌ ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కింది.

* విశాఖ ఉక్కు కర్మాగారంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని.. దీన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణను తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు.

* ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొని స్ఫూర్తిని చాటారు. మరోవైపు, సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,004కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,177 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,763కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,43,56,138 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.