* మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును పరమ శివునిపై కేంద్రీకరించాలి.వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ఓం నమః శివాయ!!
* ఒక నాడు బ్రహ్మ, విష్ణువులకి తమలో ఎవరు గొప్ప అనే విషయం పై వాదనవచ్చింది. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడనని బ్రహ్మ, నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు అంటాడు విష్ణువు. యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యు ద్ధాన్ని ఆరంభిస్తారు. విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒక రు సంధించుకొంటారు. అప్పటివరకు వీరి యుద్ధాన్ని చూస్తున్న దేవతలు భయంతో ఆ మహాదేవుని దగ్గరకి వెళ్లి శరణు వేడగా శివుడు అగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించి ఆ అస్త్రాలను తనలో లయం చేసుకుంటాడు. అప్పుడు ఆ మహా శివుడు జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు.(శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటారు.) నా ఆది, అంతం ఎవరు కనుక్కుం టారో వారే గొప్ప అని చెప్తాడు శివుడు .
**విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు కిందకు దిగుతూ, ఒక మొగలి పువ్వు కింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసిన బ్రహ్మ నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండంటూ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. దానికి మొగలి పువ్వు అవునని, కామ ధేనువు నిజమేనంటూ తల ఊపుతూ, కాదు అన్నట్టు తోక అడ్డంగా ఊపుతుంది.
.**శివుడు విష్ణువు సత్య వాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణు వు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వ దిస్తాడు. సర్వాంతర్యామి అయిన శివుడు కోపోద్రేకుడై బ్రహ్మని, మొగలి పువ్వును, కామ ధేనువును శపిస్తాడు. బ్రహ్మ యొక్క ఐదుతలలోంచి అబద్ధం చెప్పిన తలను నరికివేయమని తన కనుబొమ్మల్లోంచి భైరవుడిని సృష్టించి ఆజ్ఞాపిస్తాడు. శివాజ్ఞను శిరసా వహించిన భైరవుడు బ్రహ్మ యొక్క తలను నరికివేస్తాడు. పూజకు నిన్ను ఉపయోగించరు అంటూ మొగలి పువ్వును, పూజలుండవంటూ కామధేనువుని శపిస్తాడు. తిరిగి వీరు ముగ్గురూ శరణు వేడగా బోళా శంకరుడు శాంతించి మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ వెనక భాగము పునీతమై, పూజలనందుకొనును అంటూ వరమిచ్చాడు. అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉందువంటూ చెబుతాడు.అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును అని వరమిచ్చెను.మాఘమాసం 14వ రోజున శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించినందున శివరాత్రిగా జరుపుకుంటారని కొందరు, ఆ రోజునే క్షీరసాగర మథనం జరిగి శివుడు గరళాన్ని తన గొంతులో దాచుకున్నాడని మరికొందరు అంటారు. పార్వతీ పరమేశ్వరుల పెళ్లిరోజుగానూ శివరాత్రిని జరుపుకుంటారని, గంగ దివినుండి భువికి వచ్చింది కూడా ఈ రోజే అని ఇలా రకరకాల కథనాలున్నాయి. ఏదేమైనా, మహా శివరాత్రి రోజు శివుడికి ప్రీతిపాత్రమైంది కనుక జాగారం చేసి అత్యంత నిష్టతో, ఉపవాసాలతో ప్రజలు శివున్ని పూజిస్తారు.
**కైలాస పర్వతం – మధుకర్ వైద్యుల
సముద్రమట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరమిది. చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస మహాపర్వతం పైన సాక్షాత్తు శివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే జీవితంలో ఒక్కసారన్నా కైలాస పర్వతాన్ని సందర్శించి తరించాలని తపించే వారెందరో! కైలాస పర్వతశ్రేణుల్లోకి అడుగు పెడితే చాలు, మనల్ని మనం మరిచిపోయి దైవ చింతనలో లీనమై పోతాం. ఇంతటి పవిత్రత గల ఈ ప్రాంతం నిత్యం వేలాదిమందితో అలరారుతుంటుంది. మహర్షులు, ఋషులు, స్వామిజీలతో పాటు సామాన్యులు సైతం ధ్యానముద్రలో ఇక్కడి పవిత్ర వాతావరణంతో మమేకమైపోతారు. నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. కైలాస పర్వతం స్వయంభు. అంటే దానికదే అవతరించిందని. నిజానికి కైలాస పర్వతం, దీనికి సమీపంలోనే ఉండే మంచినీటి సరస్సు ఐన మానస సరోవరం సృష్టికంటే కూడా పురాతనమైనవని హైందవ పండితులు చెబుతుంటారు. మానస సరోవరంలోని నీరు తాగితే మరణానంతరం నేరుగా కైలాసానికి చేరవచ్చని, స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అతి శీతలమైన ఈ సరస్సు చలికాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే వేసవి, మిగతా ఋతువుల కాలంలో మాత్రమే ఇక్కడికి వస్తుంటారు.
**హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని విశ్వసిస్తారు. మహావిష్ణువు కాలి బొటనవేలి నుంచి ఉద్భవించిన గంగానది చాంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి భూమికి వచ్చిందని, గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజూటంలోకి ఇక్కడే స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. బౌద్ధులూ ఈ ప్రాంతాన్ని అత్యంత పుణ్యస్థలంగా భావిస్తారు. శిఖరంపైన ఉన్న బుద్ధుడు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంటాడు. దీన్ని ధర్మపాలగా వారు పిలుస్తారు.
**పశుపతినాథ ఆలయం…
హిమాలయాల్లో కొలువైన ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. శివుడి తత్వాన్ని బోధించే ఈ క్షేత్రం కాశీ క్షేత్రమంత పవిత్రమైందని అంటారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలువబడుతున్నాడు. ఈ దేవాలయం తూర్పు ఖాట్మండులోని భాగమతి నదీ తీరాన కొలువై ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనడానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని శాసనాల ప్రకారం క్రీస్తుశకం 753లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11వ జయదేవ ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. క్రీస్తుశకం 1416లో రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడనీ అంటారు. క్రీస్తుశకం 1697లో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడని తెలుస్తోంది.
**దీని నిర్మాణం ప్రత్యేక శైలిలో వుంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారాలతో తాపడం చేసి ఉంటాయి. నాలుగు ప్రధానద్వారాలకు వెండి తాపడం వుంటుంది. పశ్చిమ ద్వారం దగ్గర కొలువున్న ఆరు అడుగుల పెద్ద నంది విగ్రహమూ బంగారు కవచంతో వుంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. ఆ రోజు ఇక్కడికి వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కేవలం నేపాల్ వాసులే కాకుండా దేశ, విదేశాలకు చెందిన భక్తులు శంభోశివ శంబో శివ శివశంభో అంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తారు. గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకోవడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.
* కాల భైరవ జయంతిని శివుని భక్తులు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాల భైరవ జయంతిని నేడు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర (హిందూ క్యాలెండర్ కార్తీక మాసం తర్వాత నెల) కృష్ణ పక్షంలో కాల భైరవ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం. ఈ జయంతిని కాల భైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. కాల భైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాధారణ నైవేద్యాలతో సులభంగా సంతోషించే శివుడి రూపమే కాల భైరవ అవతారం. భైరవుడు కుక్క మీద కూర్చున్నందున, భక్తులు కుక్కలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. హల్వా పూరీని నైవేద్యంగా సమర్పిస్తారు. శనివారాన్ని ఈయన పర్వ దినంగా భావించి కొలుస్తారు.
***కాల భైరవుని ప్రాముఖ్యత
కాల భైరవునికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శివుని ఈ రూపం భయాన్ని దూరం చేస్తుంది. దురాశ, కోపం, కామాన్ని జయించవచ్చని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం దేవతలు, అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షస వినాశనం కొరకు శివుడు కాల భైరవున్ని సృష్టించాడు. తరువాత అష్ట భైరవులు సృష్టించబడ్డారు. వీరు భయంకరమైన రూపం కలిగిన అష్టా మాత్రికలను వివాహం చేసుకున్నారు. ఈ అష్ట భైరవులు, అష్టా మాత్రికల నుంచి 64 మంది భైరవులు, 64 యోగినిలు సృష్టించబడ్డారు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారో నిరూపించడానికి చర్చించారని, చర్చ మధ్యలో బ్రహ్మ.. శివుడిని విభేదించడంతో అతని కోపంతో కాల భైరవుడు జన్మించాడని ఒక నమ్మకం.
***భారత్‌లో ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు
*కాల భైరవ ఆలయాలు సాధారణంగా దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ దేవాలయాల చుట్టూ కనిపిస్తాయి.
*షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని కాల భైరవ ఆలయం ప్రత్యేకమైనది. భక్తులు దేవతకు మద్యం ఆర్పిస్తారు.
*వారణాసిలోని కాల భైరవ మందిరాన్ని వారణాసి యొక్క కొత్వాల్ అని నమ్ముతారు, ఇది తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి.
*కాలభైరవేశ్వర కర్ణాటకలోని ఒక పురాతన ఆలయం, దీనిని ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్ర పాలక అని పిలుస్తారు.
*ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి
*తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కలభైరవర్ ఆలయం కాల భైరవ రూపానికి అంకితం చేయబడింది.
*రాజస్థాన్‌లో జుంజూన్ జిల్లాలోని చోముఖ భైరవ ఆలయం శైవుల ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.
*మధ్యప్రదేశ్‌లోని అడెగావ్‌లోని శ్రీ కాల భైరవనాథ్ స్వామి ఆలయం దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్‌తో సహా దేశాలు సందర్శించే పవిత్ర ప్రదేశం.
*భారతదేశంలోని కాల భైరవ దేవాలయాలు సాధారణ శివాలయాలకు భిన్నంగా ఉంటాయి. నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి.
* నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ మందిరాన్ని భక్తుల దర్శనాల కోసం తెరిచారు. మార్చి 11న మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన భక్తులు భారీ సంఖ్యలో నేపాల్ రాజధాని ఖాట్మాండూ చేరుకుని అక్కడి పశుపతినాథ్ మందిరాన్ని సందర్శిస్తారు. ఆలయంలో కొలువైన మహాశివునికి పూజలు నిర్వహిస్తారు. కాగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసు విభాగం కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఆలయ పరిసరాల్లో పలు సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా నేపాల్ ప్రభుత్వం భారత్-నేపాల్ సరిహద్దులను 2020, మార్చి 24 నుంచి మూసివేసింది. అయితే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తరుణంలో భారత్, చైనాలకు సంబంధించిన 30 సరిహద్దులను నేపాల్ ప్రభుత్వం తెరిచింది. అయితే నేపాల్‌లోకి వచ్చేవారిపై పలు ఆంక్షలు అమలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నాగా సాధువులతో పాటు సాధారణ భక్తులు సైతం పశుపతినాథుణ్ణి సందర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు.
* పంచారామాలకు నెలవై, అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగమైన తెలుగు నేల నలుచెరగులా పరచుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఎన్నో… మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని తెలిపే కథలూ, గాథలూ చిరస్మరణీయం. మూర్తి రూపంలోనూ, లింగాకారంగానూ పూజలందుకునే దైవం శివుడు. కానీ, లింగ రూపమే అందులో ప్రధానమైంది. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని విశ్వసిస్తారు నాయనార్లు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటారు. అందులో కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున లింగం ఒకటి. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారని ప్రతీతి.
*** పురాణాల ప్రకారం తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలైంది. దేవతలు ఆ అయిదింటినీ అయిదు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఆ ప్రసిద్ధ క్షేత్రాలే పంచారామాలుగా ఆ దేవదేవుని ఆవాసాలుగా వెలుగొందుతున్నాయి. అవే ఆంధ్రప్రదేశ్‌లోని… దక్షారామం (ద్రాక్షారామం, తూ.గో. జిల్లా), కుమారారామం (సామర్లకోట, తూ.గో. జిల్లా), క్షీరారామం (పాలకొల్లు, ప.గో. జిల్లా), సోమారామం (భీమవరం, ప.గో. జిల్లా), అమరారామం (అమరావతి, గుంటూరు జిల్లా). ఇవికాక శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగేశ్వరం, చిత్తూరులోని కపిలతీర్థం, పశ్చిమ గోదావరిలోని ముక్తేశ్వరం, గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ, కర్నూలులో మహానంది, అదే జిల్లాలోని యాగంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి.
*