Business

టీవీ ధరలు పెరుగుతాయి-వాణిజ్యం

టీవీ ధరలు పెరుగుతాయి-వాణిజ్యం

* పెరగడం తప్ప తగ్గడం తెలియని బంగారం కొంతకాలంగా చిన్నబోతోంది. కరోనా అనంతర పరిణామాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. మూడు వారాలుగా నేల చూపులు చూస్తున్న పసిడి సూచీలు కొనుగోలు దారులకు ఆశలు రేపుతుంటే.. ఇప్పటికే కొన్నవారిలో ఈ రేట్లు ఇంకెంతగా క్షీణిస్తాయోనని గుబులు రేపుతున్నాయి. పెట్టుబడులకు బంగారమే అనువైందని భావించి అత్యధిక ధరల వద్ద కొనుగోలు చేసినవారు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. అసలు బంగారానికి ఏమైంది? కొనుగోలుదారులకు రానున్న రోజుల్లో పసిడి నమ్మకమైన పెట్టుబడిగా నిలుస్తుందా? లేదా?

* కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ నెలలోనే తీసుకోండి. ఏప్రిల్‌ నుంచి ఎల్‌ఈడీ టీవీలు మరింత ప్రియం కానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా టీవీల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే ఎల్‌జీ తమ ఉత్పత్తులపై ధరలను పెంచగా.. పానసోనిక్‌, హయర్‌, థామ్సన్‌ వంటి సంస్థలు కూడా ఇదే యోచనలో ఉన్నాయి.

* ధ‌ర‌ల పెరుగుద‌ల ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వల యోజ‌న (పీఎంయువై) క‌స్ట‌మ‌ర్ల‌లో ‘ఎల్‌పీజీ’ వినియోగం 23.2% పెరిగింద‌ని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్) నివేదికలో తెలిపింది. గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే, మొత్తం దేశీయ ఎల్‌పీజీ అమ్మ‌కాలు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో (ఫిబ్ర‌వ‌రి 21 వ‌ర‌కు) 10.3% వృద్ధిని న‌మోదు చేశాయ‌ని ‘ఐఓసీఎల్‌’ ప్రకటించింది.

* దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులకు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌ (ఎంఓడీఎస్) ను అందిస్తోంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. అలాగే మీకు అవసరం అయినప్పుడు డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. ఇది పొదుపు లేదా కరెంట్ అకౌంట్‌తో అనుసంధానించి ఉంటుంది. ఖాతాదారులు మెచ్యూరిటీకి ముందుగానే డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అకౌంట్‌లోని డబ్బులకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోతుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మన దేశ అభ్యర్థన పెడచెవిన బెట్టి ఉత్పత్తి కోతలకే కట్టుబడతామని ఒపెక్‌, అనుబంధ దేశాలు ఇటీవల ప్రకటించాయి. ఇందువల్ల ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముడిచమురు కోసం మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడక, కొత్త దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు సంస్థలకు ఆదేశాలిచ్చిందని సమాచారం.
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడిచమురు దిగుమతి దేశం మనది. దేశీయ అవసరాల్లో 84 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఇందులో 60 శాతానికి పైగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి తరలి వస్తోంది. పశ్చిమ దేశాలతో పోలిస్తే అక్కడి నుంచి చౌకగా లభిస్తుందనే ఉద్దేశంతో ఇలా కొనుగోలు చేస్తున్నారు. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ముడిచమురు ధర గణనీయంగా తగ్గినపుడు, ఉత్పత్తి కోత విధించి ధరల్లో స్థిరీకరణ తేవాలని సౌదీ అరేబియా సహా ఇతర ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమై, మళ్లీ బ్యారెల్‌ ముడి చమురు ధర 65-70 డాలర్లకు చేరినందున ఉత్పత్తి పెంచి, ధరలకు కళ్లెం వేయాలని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. ఒపెక్‌, అనుబంధ దేశాలను పలుమార్లు కోరారు. ఇటీవల జరిగిన ఒపెక్‌ దేశాల సమావేశంలో ఈ అభ్యర్థనలను పట్టించుకోనేలేదు. చమురు ఉత్పత్తిపై ఆంక్షల్ని ఏప్రిల్‌ వరకూ కొనసాగించాలని ఆయా దేశాలు నిర్ణయించాయి. ‘గత ఏడాది అతి తక్కువ ధరలో ముడి చమురు కొనుగోలు చేశారు కదా.. ఆ నిల్వల్ని ఇప్పుడు వినియోగించుకుంటే, దేశీయంగా ధరలు తగ్గుతాయ’ని భారత్‌కు సౌదీ అరేబియా ఇంధన మంత్రి సలహా కూడా ఇచ్చారు. 2020 ఏప్రిల్‌, మేలో బ్యారెల్‌ ముడి చమురును 19 డాలర్ల సరాసరి ధరతో భారత్‌ కొనుగోలు చేసి, దేశీయంగా నిల్వ చేసినందున, ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

* సెల్‌ఫోన్లను భారీ రాయితీపై ‘ఫ్లాష్‌సేల్‌’లో ఇకామర్స్‌ సంస్థలు విక్రయించడం చూశాం. ఇప్పుడు ఇళ్ల విక్రయాలకూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్థిరాస్తి సంస్థ టాటా హౌసింగ్‌ ప్రకటించింది ఈ నెల 12 నుంచి 15 వరకు ‘ది ఫైనల్‌ రష్‌’ పేరిట ఫ్లాష్‌ విక్రయాలు నిర్వహించబోతున్నట్లు తెలిపింది. తమ 15 ప్రాజెక్టుల్లోని 150 గృహాలను రాయితీ ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. రూ.20 లక్షల నుంచి రూ.6 కోట్ల విలువ చేసే గృహాలపై ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఫ్లాష్‌ విక్రయాల్లో పాల్గొనే గృహ కొనుగోలుదార్లకు రూ.2-21 లక్షల వరకు ప్రయోజనం దక్కుతుందని టాటా హౌసింగ్‌ వివరించింది.