పదవులను పారంపర్య ఆస్తిగా పంపకాలు చేయడానికి తానా ఒకరి సొత్తు కాదని, పనిచేసే వారికే పట్టం కట్టడం, వ్యక్తిగత ఎజెండాలకు దూరంగా ఉండటమే తానాను నడిపించడానికి తమ ఆదర్శాలని 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థికి బరిలో ఉన్న శృంగవరపు నిరంజన్ అన్నారు. శుక్రవారం నాడు ఫ్రిస్కోలోని ప్రవాసులతో ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తానాతో తన అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. తానా ద్వారా ప్రవాస తెలుగువారి గొంతుకను అమెరికాలో గట్టిగా వినిపిస్తామని, తెలుగువారి తదుపరి తరానికి మార్గనిర్దేశం చేసే కార్యక్రమాల విస్తృతి పెంచుతామని, తానాకు సమయం పెట్టే వారికి ఎల్లప్పుడు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తమ ఎన్నికల నినాదం #TANA4CHANGE గురించి మాట్లాడుతూ ఒకరు చెప్తే అధ్యక్షుడు కావడం కాదంటే పక్కన నిలబడటం వంటి ఆభిజాత్య ధోరణులకు దూరంగా తానాను తీసుకువెళ్లే మార్పుకు శ్రీకారం చుట్టడమే తమ నినాదమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ ప్యానెల్ సభ్యులు వేమూరి సతీష్, ఉమా కటికి, శిరీష తూనుగుంట్ల, జనార్ధన్ నిమ్మలపూడి, ఓరుగంటి శ్రీనివాస్, సుమంత్ రామిశెట్టి, హితేష్ వడ్లమూడి, రాజా కసుకుర్తి, తాళ్లూరి మురళీ, పురుషోత్తమ చౌదరి, తానా ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, లావు అంజయ్య చౌదరి, పోలవరపు శ్రీకాంత్, అడుసుమిల్లి రాజేష్, రామ్ యలమంచిలి తదితరులు పాల్గొన్నారు.
########