2021 తానా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న నిరంజన్ శృంగవరపు ప్యానెల్ DFW మెట్రోలో సుడిగాలి పర్యటన జరుపుతోంది. ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం స్థానిక ప్రవాస తెలుగు ప్రముఖుడు మల్లవరపు అనంత్ నివాసంలో సౌత్‌లేక్ ప్రాంత ప్రవాసులను కలుసుకున్న ఆయన ప్యానెల్ మధ్యాహ్నం అర్వింగ్‌లో కృష్ణా జిల్లా ప్రవాసులను కలిసి వారి మద్దతును అభ్యర్థించింది. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ తన పూర్వీకులది కృష్ణా జిల్లా అని, వ్యవసాయం నిమిత్తం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వెళ్లి తాము స్థిరపడ్డామని తానాలో కృష్ణా జిల్లా ప్రవాసులది ప్రత్యేక స్థానమని ఆయన కొనియాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు డా.కాకర్ల సుబ్బారావుతో మొదలుపెట్టి తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వరకు తానాలో పలు కీలక పదవుల్లో సేవలందించి సంస్థను అగ్రపథాన నిలిపిన వారి గురించి ప్రస్తావించవల్సి వస్తే కృష్ణా జిల్లా ముందు వరుసలో ఉంటుందని ఆయన కొనియాడారు. మహిళలు, వయోధికులు, వైద్యులు, అమెరికాలో పెరిగిన తదుపరి తరానికి చెందిన యువత వంటి సకల కళాపోషక ప్యానెల్‌గా ఉన్న తాము మార్పు కోసం చేతులు కలిపామని ఈ మార్పు నిట్టూర్పు చెందకుండా ఉండాలంటే తమ ఓట్లను అందజేసి గెలుపు తీర్పు అందజేయాలని నిరంజన్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్యానెల్ అభ్యర్థులు డా.ఉమా కటికి, శిరీష తూనుగుంట్ల, శశాంక్ యార్లగడ్డ, నిమ్మలపూడి జనార్ధన్, తాళ్లూరి మురళీ, పోలవరపు శ్రీకాంత్, రాజా కసుకుర్తి, సుమంత్ రామిశెట్టి, గుదే పురుషోత్తమ చౌదరి, హితేష్ వడ్లమూడి, వేమూరి సతీష్, తానా ప్రతినిధులు జయశేఖర్ తాళ్లూరి, చలసాని కిషోర్, అడుసుమిల్లి రాజేష్, చాగర్లమూడి సుగన్, యలమంచిలి రామ్ తదితరులు పాల్గొన్నారు.
########