* టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి కంపెనీలో 26.12 శాతం వాటా ఉంది. 16.12 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మనుంది. మిగతా వాటాను టాటా సన్స్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ విభాగం పానాటోన్ ఫిన్‌వెస్ట్‌కు విక్రయించనుంది. ఆ మేరకు భారత రాష్ట్రపతి, పానాటోన్ ఫిన్వెస్ట్, టాటా సన్స్ మధ్య సవరించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పానాటోన్కు ఇప్పటికే 34.8%, టాటా సన్స్‌కు 14.07 శాతం చొప్పున వాటాలున్నాయి. ప్రభుత్వ వాటా విలువ ప్రస్తుత ధరల వద్ద రూ.9601 కోట్లుగా ఉంది.
* దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్, తన వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయడానికి అనుమతించే అనేక రకాల పరికరాలను ప్రారంభించింది. గత ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టైటాన్ భాగస్వామ్యంతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రారంభించింది.
* తొలిసారి జరిగిన క్వాడ్ భాగస్వామ్య దేశాల అగ్రనేతల భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకమైన అంశం.. ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలకు అవసరమైన కరోనా టీకాలను భారత్‌లో ఉత్పత్తి చేయించాలని నిర్ణయించడం. ఇందుకు అవసరమైన ఆర్థిక, రవాణా సదుపాయాలను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సమకూర్చాలని నిర్ణయించారు. 2022 చివరికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ తరఫున ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. క్వాడ్‌లోని ఇతర దేశాలకు టీకా తయారీ విషయంలో భరోసా కల్పించారు. సభ్యదేశాల సహకారంతో టీకా తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు అండగా ఉంటామని చెప్పారు. తద్వారా ఈ ప్రాంతంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ఆర్థిక సహకారం అమెరికా, జపాన్ నుంచి లభించనున్నట్లు హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. ఇక టీకాలను క్షేత్రస్థాయికి చేర్చేందుకు కావాల్సిన రవాణా సదుపాయాలను ఆస్ట్రేలియా సమకూర్చనుంది.
* దేశీయంగా బ్యాంకుల రుణాలు ఈ ఫిబ్రవరి 26 నాటికి 2 వారాల్లో 6.6% పెరిగాయి.బ్యాంక్ డిపాజిట్లు రూ. 1.52 లక్షల కోట్లకు పెరిగి రూ. 149.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ఈ కాలంలో రుణాలు రూ. 71,273 కోట్లకు పెరిగి రూ. 107.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి.భారతీయ బ్యాంకుల రుణాలు ఈ ఫిబ్రవరి 26 నాటికి 2 వారాల్లో 6.6% పెరిగి, డిపాజిట్లు 12.1% పెరిగాయని ఆర్బీఐ తెలిపింది.ఆహారేతర పరిశ్రమలకు రుణాలు రూ. 71,355 కోట్లకు పెరిగి రూ. 107 లక్షల కోట్లకు చేరుకోగా, ఆహార సంబంధిత పరిశ్రమలకు రుణాలు రూ. 81 కోట్లు తగ్గి రూ. 75,206 కోట్లకు చేరుకున్నాయి.
* ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు రేట్లలో 60 వేల విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 999 రూపాయల నుంచి టికెట్ ధరలు ప్రారంభం.
* వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.