Business

రికార్డులు బద్ధలుకొట్టిన బిట్‌కాయిన్-వాణిజ్యం

Business News - Bitcoin Hits All Time High At 60K USD

* కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆదివారం పేర్కొన్నారు. ఆయన నేడు పీటీఐ వార్త సంస్థతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో దేశ పరపతి విధానంలో భారీ మార్పులు చేస్తే బాండ్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందనన్నారు. ప్రస్తుత విధానం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంతోపాటు వృద్ధికి ఊతమిస్తోందన్నారు. ఇక 2024-25 నాటికి భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యం జాగ్రత్తగా అంచనా వేసిందనదానికంటే.. మరింత ఆశాజనకంగా నిర్దేశించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

* క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ మరోసారి సత్తాచాటింది. నేడు అత్యధికంగా 61,080 డాలర్ల మార్కును దాటేసింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.44.39 లక్షలన్నమాట. ఫిబ్రవరి నెల చివర్లో భారీగా విలువ కోల్పోయిన బిట్‌కాయిన్‌ ఈ నెలలో పుంజుకొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడం బిట్‌కాయిన్‌ మార్కెట్‌కు మంచి ఊపునిచ్చింది.

* రేపటి నుంచి లక్ష్మి ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్లోకి వచ్చేందుకు ఐపీవో బిడ్లను స్వీకరించనుంది. మార్చి 15వ తేదీన మొదలయ్యే ఈ ఐపీవో 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనిలో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.129 నుంచి రూ.130గా నిర్ణయించారు. బిడ్‌చేసే వారు కనీసం ఒక లాట్‌ (లాట్‌సైజు 115 ) వాటాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ నుంచి కంపెనీ రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో కంపెనీకి చెందిన రూ.300 కోట్లు విలువైన వాటాలు, ప్రమోటర్‌ యెల్లో స్టోన్‌ గ్రూపునకు చెందిన రూ.300 కోట్లు విలువైన షేర్లను విక్రయిస్తున్నారు.

* అతి తక్కువ సమయంలో దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్లో ఆదరణ పొందిన ఘనత కియా మోటార్స్‌ ఇండియా సొంతం. కియా కారు కోసం ఇప్పటికీ రెండు-మూడు నెలలు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నెలకొల్పిన యూనిట్‌ ద్వారా ఈ సంస్థ సెల్టోస్‌, సోనెట్‌ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించటంతో పాటు 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కొవిడ్‌-19 వల్ల వినియోగదార్ల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో ప్రయాణాలను ఇష్టపడుతున్నారని కియా మోటార్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టే-జిన్‌ పార్క్‌ ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. దీనివల్ల ప్రారంభ స్థాయి(ఎంట్రీ లెవల్‌), నాలుగు మీటర్ల లోపు(సబ్‌-4 మీటర్‌) కార్లకు గిరాకీ అధికంగా కనిపిస్తోందని తెలిపారు. వినియోగదార్లలో వస్తున్న ఈ మార్పులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా కొత్త మోడళ్లు తీసుకొస్తామని తెలిపారు.

* దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కొత్తగా 66 కొత్త విమాన సేవలను ప్రారంభించబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే ఉన్న మార్గాల్లో ఉండగా.. మరికొన్ని అదనంగా జోడించినట్లు పేర్కొంది. ఉడాన్‌ పథకంలో భాగంగా కొన్ని చిన్న పట్టణాలకు ఇప్పటికే విమానాలు నడుపుతుండగా.. ఆయా ప్రాంతాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్తగా విమానాలను ప్రారంభిస్తోంది. ఇందులో హైదరాబాద్‌-దర్భాంగా, హైదరాబాద్‌-ముంబయిల మధ్య కొత్త సర్వీసులను నడపనుంది.

* అసలే రానున్నది ఎండాకాలం.. పైగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. చక్కగా ఓ ఏసీ కొనుక్కుందాం అనుకునేవారికి వేడి కబురు. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏసీ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ధరలు పెంచనున్నాయి. అదే సమయంలో ఈ సారి రెండంకెల వృద్ధి ఉంటుందని కంపెనీలు ఆశావహ దృక్పథంతో ఉన్నాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఉన్న నేపథ్యంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని వోల్టాస్‌, డైకిన్‌, ఎల్జీ, పానాసోనిక్‌, హైయర్‌, బ్లూస్టార్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. నో కాస్ట్‌ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్‌ వంటి సదుపాయలు కల్పిస్తూ సేల్స్‌ను పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఏసీ తయారీకి వినియోగించే మెటల్‌, కంప్రెసర్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్‌ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, డిమాండ్‌ ఏమాత్రం తగ్గదని డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్‌ జీత్‌ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్‌ వెల్లడించింది. రిఫ్రిజిరేటర్ల ధరలు సైతం 3-4 శాతం పెంచనున్నట్లు ఆ కంపెనీ దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీశ్‌ శర్మ తెలిపారు.