పచ్చబొట్టు ప్రస్తుతం హోదాకు చిహ్నంగా మారిపోయింది. యువత గురించి చెప్పాల్సిన పనేలేదు. వేలంవెర్రిగా ఒంటిపై రంధ్రాలను పొడిపించుకుని ప్రమాదకరమైన సిరాను చర్మంలోకి ఎక్కించుకుంటున్నారు. ఒక్కసారి పచ్చబొట్టు పడిందంటే అంతే జీవితాంతం పుట్టుమచ్చ మాదిరిగా ఉండిపోవాల్సిందే. తేడా వస్తే పలు చర్మసంబంధ వ్యాధులు దాడి చేస్తాయి. శస్త్రచికిత్స చేసి తొలగించినా పూర్తిస్థాయిలో మునిపటి మాదిరిగా చర్మం వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే శరీరంపై సూది పడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
****ప్రేమావేశంలో ప్రేమికులు ఒకరి పేరు మరొకరు పచ్చబొట్టు పొడిపించుకుని ఇబ్బంది పడుతున్న సమస్యలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి.ఎలాగైనా పచ్చబొట్టు తొలగించాలంటూ చర్మ, సౌందర్య వైద్య నిపుణులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. విద్యా కేంద్రాలుగా ఎదిగిన విజయవాడ, గుంటూరు పరిధిలోని ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లోని యువతలో పచ్చబొట్ల ఫ్యాషన్ను విపరీతమైన క్రేజ్ పెరిగింది. తన ప్రేయసి, ప్రియుడి పేర్లను ఒంటిపైన, శరీరంపైనా పొడిపించుకోవడం, లేదంటే ప్రేమికులిద్దరూ కలిసి ఒకేలాంటి పచ్చబొట్టును వేయించుకోవడం చేస్తున్నారు. ప్రేమ పెళ్లి వరకూ వెళ్తే పర్వాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఇబ్బందులే ఎక్కువ. తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాలంటే ఖర్చుతో కూడిన లేజర్ శస్త్రచికిత్స చేయాల్సిందే.
****ప్రమాదరకరమైన ఇంకు..
పచ్చబొట్లను పొడిచేందుకు వినియోగించే సిరా(ఇంకు)ను నాణ్యమైనది వినియోగించాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన, చిన్నచిన్న దుకాణాల్లో వేసే టాటూల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యత లేని, చైనా నుంచి దిగుమతి అయ్యే చౌక ధర పలికే సిరాను వినియోగిస్తుంటారు. ఈ సిరాలో ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం వంటి రసాయనాలు వినియోగిస్తుంటారు. ఇంకుతోపాటు ఇవి చర్మ రంధ్రాలలోనికి వెళ్లిపోయి ఉండడం వల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. అలర్జీతో టాటూ చుట్టూ ఎర్రని దద్దుర్లు, బొడిపెలు మాదిరిగా చర్మం మారిపోతుంది. ప్రధానంగా టాటూల కోసం వినియోగించే ఇంకుల వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
****ఆ రంగులొద్దు..
పసుపు, ఎరుపు, నీలం వంటి రంగుల నాణ్యత లేని టాటూలను వేసుకోవడం వల్ల అలర్జీలు, దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నలుపు, నేరేడుపండు, ఆకుపచ్చ రంగులతో కొంత తక్కువ అవకాశం ఉంటుంది. ఎండలోకి వెళ్లినప్పుడు టాటూలపై దురద, చెమట పట్టడం, ఎర్రగా మారి ఇబ్బంది పెట్టడం వంటివి బయటపడతాయి.
****సూది మార్చాల్సిందే..
ఇంజక్షన్లు వేసుకున్నప్పుడు సూదులను ఎలా మారుస్తుంటారో పచ్చబొట్టుకూ అంతే. గతంలో సూదిని రంగులో ముంచి పచ్చ వేసేవారు. ప్రస్తుతం స్వింగ్ మెషిన్లు వచ్చాయి. రోడ్డుపక్కన ఉండే వారు సైతం వీటినే వినియోగిస్తున్నారు. ఒకే సూదితో రోజంతా వచ్చిన వారందరికీ వేసేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. ఎవరి సూది వారికి ప్రత్యేకంగా వినియోగించాల్సిందే. సూది చర్మంలోపలికి కన్నం చేసుకుని వెళ్లి ఇంకును కొంచెం కొంచెంగా వదులుతూ ఉంటుంది. అక్కడ ఉండే రక్తం బయటకు వస్తుంది. దానిని గుడ్డతో తుడిచేస్తూ శాశ్వత టాటూను వేస్తుంటారు. అదే సూదిని మరొకరికి వాడడం వల్ల రక్తం ఒకరి నుంచి మరొకరి శరీరంలోనికి వెళ్లి.. హెచ్ఐవీ, హెపిటైటిస్ వంటి వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి పొరపాటు జరిగితే జీవితంలో కోలుకోవడం కష్టం.
***ఖర్చయినా పర్వాలేదు..
అందంగా శరీరంపై ఓ పచ్చబొట్టు పొడిపించుకోవాలనే కోరిక అందరిలోనూ ఏదో ఒక సందర్భంలో మెదులుతుంది. యువతలో అయితే.. 80శాతం పైనే పచ్చబొట్టుకు ఓటేస్తారు. అలాంటప్పుడు జీవితంలో అదో మధుర జ్ఞాపకంగా ఉండాలే తప్ప.. బాధను మిగల్చకూడదు. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువైనా గుర్తింపు ఉన్న పెద్ద స్టూడియోల్లోనే పచ్చబొట్టు వేయించుకుంటే మంచిది. శిక్షణ పొందిన సిబ్బంది, నాణ్యమైన ఇంకు, సూది మళ్లీ మళ్లీ వాడకుండా, చేతులకు గ్లౌజ్లు ధరించి పరిశుభ్రంగా చేస్తారు. ఆరోగ్య సమస్యలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. టాటూలను వేయించుకునేటప్పుడు మరీ అత్యుత్సాహంతో పెద్దగా భుజం, చేతులు, నడుం, గుండెలపై పొడిపించుకోకుండా చిన్నగా అందంగా వేసుకుంటే భవిష్యత్తు ఇబ్బందులు కొన్నైనా తగ్గుతాయి.
****తొలగించేందుకు మార్గాలు..
శాశ్వత టాటూలను తొలగించేందుకు గతం నుంచి చాలా పద్ధతులను ఆశ్రయిస్తున్నప్పటికీ. వాటివల్ల ఫలితం కొంతే ఉంటుంది. ఈ తొలగించే పద్ధతులు సైతం మరికొన్ని సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. గతంలో శస్త్రచికిత్స ద్వారా చర్మం పైపొరను తొలగించేవారు. కొందరు ఇంటి దగ్గర ట్రిక్లోరోఎసిటిక్యాసిడ్(టీసీఏ)తో చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రసాయనం చర్మంపై పొరను తొలగిస్తుంది. వైద్యుల పర్యవేక్షణ లేకుంటే దీనివల్ల మరికొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చిన్నచిన్న టాటూల విషయంలో ఉప్పు, నీటిని కలిపి టాటూపై రుద్దుతూ చెరిపే పద్ధతినీ కొందరు చేస్తుంటారు. దీనివల్ల కూడా కొత్త ఇబ్బందులు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి అత్యాధునిక లేజర్ శస్త్రచికిత్సలు అందుబాటులోనికి వచ్చాయి. లేజర్ ద్వారా చర్మ, సౌందర్య వైద్య నిపుణుల పర్యవేక్షణలో టాటూలను తొలగిస్తున్నారు. దీనికి ఖర్చు కొంచెం ఎక్కువే అవుతుంది. టాటూ పరిమాణం, వినియోగించిన రంగులు, వాడిన ఇంకు, కొత్తగా వేసినదా, బాగా పాతదా అన్నదాన్ని బట్టి దీనికి ఖర్చవుతుంది.
****కొన్ని పట్టించుకోవాలి..
* టాటూలు వేయించుకున్న వారిలో ఐదు శాతం బ్యాక్టీరియల్ సమస్యలతో బాధపడుతున్నట్టు జర్మన్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్మెంట్ సర్వేలో వెల్లడైంది.
* పచ్చబొట్ల వల్ల వచ్చే అలర్జీ, దద్దుర్లు వంటి వాటితో బాధపడేవారిలో 90శాతం మందికి నాణ్యమైన ఇంకు వాడకపోవడమే కారణమని తేలింది.
* స్థానికంగా ఉండే ఆరోగ్యశాఖ నిబంధనలు పట్టించుకోవడం, అనుమతులు సరిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకున్నాకే స్టూడియోల్లో టాటూలను వేయించుకోవాలి.
* శరీరంపై టాటూ వేయించుకున్నాక 6 గంటల తర్వాత వాపు ఎక్కువవుతుంది. నొప్పి పెరుగుతుంది. అందుకే 24గంటల తర్వాత ఆ ప్రాంతంలో వేడి నీటితో శుభ్రం చేసుకుని యాంటీ బయోటిక్ ఆయింట్మెంట్ను రాయాలి.
* కనీసం రెండు మూడు వారాలు టాటూ వేసిన ప్రాంతానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. లేదంటే చర్మం కింద ఉండే ఇంకు వల్ల దానిపైన ఉండే చర్మం కమిలిపోయి దద్దుర్లు, అలర్జీ మరింత పెరుగుతుంది.
పచ్చబొట్టుతో క్యాన్సర్ ప్రమాదం
Related tags :