Politics

చంద్రబాబుకి సీఐడీ ఎందుకు నోటీసులు ఇచ్చింది?

The full story behind CID notices to Chandrababu

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 23న హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం నోటీసులిచ్చింది. అందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయమే చేరుకున్న సీఐడీ అధికారులు.. నోటీసులు అందజేసి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలన్నారు. సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనతో పాటు గత ప్రభుత్వ హయాంలో పని చేసిన కొంతమంది అధికారులకూ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సీఐడీ మాత్రం వారి వివరాలేవీ అధికారికంగా బయటకు వెల్లడించలేదు.

నోటీసుల్లో ఏముందంటే..
‘మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీసుస్టేషన్‌లో మీపై కేసు నమోదైంది. ఈ కేసులో మెరుగైన దర్యాప్తు కోసం.. ఏ1 నిందితుడిగా ఉన్న మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మీకు మాత్రమే తెలిసిన వాస్తవాలను మీ నుంచి తెలుసుకునేందుకు ఈ విచారణ అవసరం. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి మీరు హాజరుకావాలి’ అని చంద్రబాబుకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అందులోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
* విచారణకు సహకరించాలి. కేసును తార్కిక ముగింపు దిశగా తీసుకెళ్లేందుకు మీకు తెలిసిన, లేదా మీ ఆధీనంలో ఉన్న ఆధారాల్ని సమర్పించాలి.
* ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, దర్యాప్తు ప్రక్రియలో ఎక్కడా జోక్యం చేసుకోకూడదు.
* ఈ కేసులోని సాక్షులతో గానీ, దీనికి సంబంధించిన వాస్తవాలు తెలిసిన వ్యక్తులతో గానీ సంప్రదింపులు జరపరాదు. వారిని ప్రభావితం చేయటం, బెదిరించటం, ప్రేరేపించటం వంటివి చేయకూడదు.
* ఏ రూపంలోనూ ఆధారాల్ని మాయం చేయకూడదు.
* ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానం ఎదుట మీరు తప్పనిసరిగా హాజరుకావాలి.
* ఇవికాకుండా వాస్తవాల ఆధారంగా మరిన్ని షరతులు విధించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. వాటికి లోబడి ఉండాలి.
* ఈ నోటీసులోని అంశాలకు కట్టుబడి ఉండాలి.. విచారణకు హాజరు కావాలి. లేకపోతే చట్టప్రకారం మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది.

‘గత ప్రభుత్వంలోని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు తమను మోసగించారంటూ నా నియోజకవర్గానికి చెందిన కొంతమంది రైతులు నాకు వినతిపత్రం ఇచ్చారు. తమ భూముల్ని అక్రమంగా, మోసపూరితంగా తీసుకున్నారని వారు నా దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూ సమీకరణ కింద వాటిని ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొంటూ కొంతమంది మధ్యవర్తులు అమాయక రైతుల్లో గందరగోళం సృష్టించారు. భూములు పోతాయనే అభద్రతను, భయాన్ని కల్పించారు. పెద్ద కుట్రలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని నేను పరిశీలించాను. అందులో అనేక అవకతవకలు ఉన్నాయి. వాటి వల్ల ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ జీవోల ద్వారా గత ప్రభుత్వ హయాంలోని వ్యక్తులు అనుచిత లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని గత నెల 24న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా మర్నాడే సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డీఎస్పీ ఎస్‌.సూర్యభాస్కరరావును విచారణాధికారిగా నియమించారు. ఆయన ఈనెల 12న నివేదిక సమర్పించారని, నేరం జరిగినట్లు అందులో తేలడంతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నాలుగు రోజుల కిందట సీఐడీ కేసు నమోదు చేయగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ మంగళవారం వెలుగుచూసింది. ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌),(జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొంది. ఇతర అధికారులు నిందితులుగా ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది. వారి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు.