Food

కూరగాయలు ఆరోగ్య గనులు

కూరగాయలు ఆరోగ్య గనులు

కూరగాయలే కదా అని చిన్నచూపు చూస్తున్నారా… మీరు చాలా కోల్పోతున్నట్లే. వాటిని సరిపడినంతగా తినకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. కూరగాయల్లో ఉండే అన్ని రకాల పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచి అనారోగ్యం దరిచేరకుండా చేస్తాయి. నగరంలోని జాతీయ పోషకాహార సంస్థలో మంగళవారం నిర్వహించిన 100వ వార్షికోత్సవాల్లో శాస్త్రవేత్తలు కూరగాయల ప్రాధాన్యాన్ని వివరించారు….
**తక్కువ కొవ్వులు, క్యాలరీలు
* అల్లం, చిక్కుడు జాతి కూరగాయలు, బఠానీల్లో శరీర నిర్మాణానికి కావాల్సిన… ముఖ్యంగా కండరాలు, కణజాలాలు, రక్తం ఏర్పడటానికి కావాల్సిన ప్రొటీన్లు ఉంటాయి.
* పాలకూర, చిలగడదుంప, బీన్స్‌, టమాటా, బీట్‌రూట్‌ ఆకుల్లో పొటాషియం అధికం. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
* చిన్న దోసకాయలు, మునక్కాయలు, అలసందల్లో పీచు ఎక్కువ. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను, హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో తోడ్పడుతుంది.
* పాలకూర, బీట్‌రూట్‌, క్యాబేజీ, బ్రకోలిలో ఫోలేట్‌ అనే సూక్ష్మపోషకం ఎక్కువ. ఇది ఎర్ర రక్తకణాలు పెరుగుదలకు దోహదపడుతుంది.
***పోషకాలు లభించే కూరగాయలు
* కార్బోహైడ్రేట్లు: బంగాళదుంప, చిలగడదుంప, సగ్గు బియ్యం
* ప్రొటీన్లు: తృణధాన్యాలు, చిక్కుడు, బీన్స్‌, బఠానీలు
* విటమిన్‌-ఎ: క్యారెట్‌, అమరాంథస్‌, పాలకూర, గుమ్మడి కాయలు
* విటమిన్‌-బి: బఠానీలు, చిక్కుడు
* విటమిన్‌-సి: టమాటా, మిరప, క్యాలీఫ్లవర్‌, పాలకూర, క్యాబేజీ, కాకరకాయ, మెంతులు
* కాల్షియం: మెంతులు, బ్రకోలి, ఉల్లిపాయ, బీట్‌రూట్‌, క్యాబేజీ
* పొటాషియం: చిలగడదుంప, బంగాళదుంప, కాకరకాయ, రాడిష్‌, ఉల్లిపాయలు, ఆకుకూరలు
***సూక్ష్మపోషకాల లోపం ఇలా…
* ప్రపంచంలో 200 కోట్ల మంది ఐరన్‌లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఈ లోపం ఎక్కువ.
* కోట్ల మంది చిన్నారులు విటమిన్‌-ఎ లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తాయి. అంధత్వం వస్తుంది.
* 17.3 శాతం ప్రపంచ జనాభా జింక్‌లోపంతో బాధపడుతోంది. దీనివల్ల పిల్లలో ఎదుగుదల లోపం, తక్కువ బరువు కలిగి ఉంటారు. ***ఇలా ఎదుర్కొందాం
* పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఫుడ్‌ సప్లిమెంట్‌లను ఆహారంలో భాగం చేయాలి.
* ఏ పోషక లోపంతో బాధపడుతున్నారో… అది ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.