Business

క్యాడ్బరీ ఇండియాపై సీబీఐ కేసు-వాణిజ్యం

క్యాడ్బరీ ఇండియాపై సీబీఐ కేసు-వాణిజ్యం

* ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ‘‘ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 14,600 మార్కు దిగువన ముగిసింది. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం (బాండ్‌ ఈల్డ్స్‌) మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలు మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.53గా ఉంది.

* క్యాడ్బరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (మాండెల్జ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) అవినీతికి పాల్పడిందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసు నమోదు చేసిందని పీటీఐ వార్తసంస్థ పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డీ వద్ద పన్ను లబ్ధిలను పొందడానికి వాస్తవాలను దాచిందని సీబీఐ ఆరోపించింది. దీంతో హరియాణ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఐదు ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ నేడు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించింది. కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకొంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులతో కుమ్మక్కై హిమాచల్‌ ప్రదేశ్‌లోని యునిట్‌కు రూ.241 కోట్లు విలువైన పన్ను లబ్ధిని పొంది. ఈ ఫ్యాక్టరీలో 5స్టార్‌, జెమ్స్‌ తయారు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారం 2009-2011 మధ్య జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే స్వాధీనం చేసుకొన్న ఆధారాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. క్యాడ్బరీ పన్నుఅధికారులతో కుమ్మక్కై తప్పుడు రికార్డులు సమర్పించి, కొన్ని రికార్డులను తారుమారు చేసి ప్రాంతాల వారీగా లభించే రాయితీలను పొందినట్లు తేలింది.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మోడల్‌ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. అత్యధికంగా రూ. 65వేల వరకు ఉన్న ఈ డిస్కౌంట్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, హ్యారియర్‌(5సీట్ల మోడల్‌)లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆల్టురజ్‌, సఫారీ ఎస్‌యూవీపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు. కన్జ్యూమర్‌ స్కీమ్‌, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తోంది.

* బ్యాంకుల ఆస్తుల నాణ్యత గత ఏడాది రెండో అర్ధ భాగంలో మెరుగైనప్పటికీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో డీలా పడే అవకాశం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే వెల్లడించింది. 2021 తొలి 6 నెలల కాలంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేసింది. 2020 జులై-డిసెంబరు మధ్య కాలంలో ఫిక్కీ-ఐబీఏ కలిసి 20 బ్యాంకులపై ఈ సర్వే చేశాయి. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగ, విదేశీ బ్యాంకుల్ని సైతం పరిగణనలోకి తీసుకున్నాయి. ఆస్తుల పరిమాణం పరంగా ఈ బ్యాంకులు మొత్తం పరిశ్రమలో 59 శాతం వాటా కలిగి ఉన్నాయి. సగం బ్యాంకులు 2020 రెండో అర్ధ భాగంలో ఎన్‌పీఏలు తగ్గాయని పేర్కొన్నాయి. 78 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులూ ఇదే సమాచారం ఇచ్చాయి.