Sports

హమ్మయ్యా…క్వార్టర్‌కు సింధు

హమ్మయ్యా…క్వార్టర్‌కు సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అయిదోసీడ్‌ సింధు 21-8, 21-8తో లిన్‌ క్రిస్టోఫెర్‌సన్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేసింది. సింధు దూకుడు ముందు లిన్‌ నిలువలేకపోయింది. స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ టోర్నీకి దూరమైంది. మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)తో తొలి రౌండ్‌ పోరులో 8-21, 4-10తో వెనకబడి ఉన్న సమయంలో తొడ కండర గాయంతో ఆమె పోటీ నుంచి వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌ చేరాడు. అతడు 21-18, 21-16తో థామస్‌ రౌక్సెల్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఈ పోరులో తొలి గేమ్‌లో తప్ప ప్రత్యర్థి నుంచి 19 ఏళ్ల సేన్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. మరోవైపు సాయిప్రణీత్‌ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు 21-15, 12-21, 12-21తో రెండో సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)పై పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ గెలిచి జోరు మీద కనిపించిన సాయి.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు చేజార్చుకుని ఓటమి పాలయ్యాడు. మాజీ ప్రపంచ టాప్‌-10 ఆటగాడు హెచ్‌ఎస్‌.ప్రణయ్‌ కూడా ఓడిపోయాడు. ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ 15-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటొ మొమొటా (జపాన్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సాత్విక్‌-అశ్విని 19-21, 9-21తో యుకి కనెకొ-మిసాకి (జపాన్‌) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 16-21, 21-11, 17-21తో కిమ్‌-అండ్రెస్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో అశ్విని-సిక్కిరెడ్డి క్వార్టర్స్‌ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో ఈ భారత జోడీ 21-17, 21-10తో గాబ్రెయెలా-స్టెఫానీ (బల్గేరియా)పై నెగ్గింది.