తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తుల పరిరక్షణకు తితిదే చర్యలు చేపట్టింది. అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. తిరుమలలోని శ్రీవారి ఉత్సవమూర్తులకు వివిధ సందర్భాల్లో ఏడాదిలో 450 సార్లు అభిషేకం (తిరుమంజనం) నిర్వహిస్తుంటారు. ఇందులో కొన్ని పండగలు, ఉత్సవాల సమయంలో ఏకాంతంగా చేస్తుంటారు. ఇలా పెద్ద ఎత్తున అభిషేకాలు చేయడం వల్ల విగ్రహాలు అరిగిపోతున్నట్లు అర్చకులు గుర్తించారు. విగ్రహాల ముఖాలు మారిపోయి సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడుతున్నారు. అభిషేకాల్లో రోజూ చేసే వసంతోత్సవంతో పాటు వారంలో ఒకరోజు నిర్వహించే విశేష పూజ, సహస్ర కలశాభిషేకాలు ఉన్నాయి. ఈ సేవలకు తిరుమల శ్రీవారి పూజా విధానంలో ఎలాంటి చారిత్రక ప్రాధాన్యం లేదని ఆగమ సలహామండలి సభ్యులతోపాటు ప్రధాన అర్చకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సహస్ర కలశాభిషేకం ఏడాదిలో ఒక్కసారే నిర్వహించేవారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోందని చెబుతున్నారు. ఆర్జిత వసంతోత్సవం ఏడాదిలో మూడుసార్లు నిర్వహించేవారంటున్నారు. తొలుత ఆర్జిత వసంతోత్సవాన్ని రంగనాయక మండపంలో చేసేవారు. 2006 నుంచి ఈ సేవను రాంభగీచా అతిథిగృహం వద్ద ఉన్న వైభవోత్సవ మండపంలో రోజూ నిర్వహిస్తున్నారు.
వెంకన్న విగ్రహం అరగకుండా చర్యలు
Related tags :