Movies

ఒంటరితనం బాగుంటుంది

ఒంటరితనం బాగుంటుంది

‘ఆషిక్ బనాయా ఆప్నే’తో కథానాయికగా తెరంగేట్రం చేసి తొలిప్రయత్నంలోనే బాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకున్నారు నటి తనుశ్రీ దత్తా‌. కొన్ని వ్యక్తిగత కారణాలతో బాలీవుడ్‌కు దూరమైన ఈ నటి దాదాపు 11 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె విదేశాల నుంచి ముంబయికి వచ్చారు. కాగా, శుక్రవారం ఈ నటి తన 37వ పుట్టినరోజు వేడుకను జరుపుకొంటున్నారు. ‘పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మొదటి నుంచి నాకు అంతగా ఇష్టం ఉండదు. ప్రతిరోజూ ఎలా అయితే గడుపుతానో ఈరోజు కూడా అలాగే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. యోగా, ధ్యానంతో సమయం గడపాలని ఆశిస్తున్నా. అలాగే, ఈ ప్రపంచంలో ప్రతీది అస్థిరమైనదని అర్థమైంది. స్థితిగతులను బట్టి ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు కూడా. ఇప్పుడైతే నా పుట్టినరోజుకి అందరూ నాతోనే ఉండాలనుకుంటున్నారు. కానీ, ఓ సమయంలో ఎవరూ లేక ఒంటరిగానే ఉన్నాను. ఏం లేని స్థితి నుంచి ఈ స్థాయికి ఎదిగాను. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు శుక్రవారం ధ్యానం చేస్తా’’ అని తనుశ్రీ చెప్పారు.