Business

TCS రెండోసారి వేతనపెంపు-వాణిజ్యం

TCS Hikes Salary For Second Time In 6Months

* టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) తన ఉద్యోగులందరికీ వేతనాలు పెంచనుంది. ఏప్రిల్‌ నుంచే పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు చేయనున్న తొలి కంపెనీ ఇదే. దీంతో సంస్థలోని 4.7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఆఫ్‌షోర్‌ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర ఇంక్రిమెంటు ఉండొచ్చని ఈ పరిణామాలతో దగ్గరి సంబంధమున్న వ్యక్తులు పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలోనే టీసీఎస్‌ చేస్తున్న రెండో వేతన పెంపు ఇది. ఇందువల్ల ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంటు ఉద్యోగులకు లభించినట్లు అవుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబరులో ఉద్యోగులకు కంపెనీ వేతన పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2021 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని ప్రాంతాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చే పనిలో ఉన్నట్లు టీసీఎస్‌ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. పదోన్నతులను కూడా కంపెనీ కొనసాగించనుంది.

* రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన ‘స్పుత్నిక్‌ వి’ కొవిడ్‌-19 టీకాను మనదేశానికి చెందిన స్టెలిస్‌ బయోఫార్మా తయారు చేయనుంది. దాదాపు 20 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. స్టెలిస్‌ బయోఫార్మా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కు బయోఫార్మాస్యూటికల్స్‌ విభాగం. మనదేశంలో ఆర్‌డీఐఎఫ్‌ తరఫున భాగస్వామిగా ఉన్న ఎస్నో హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌పీ., తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టెలిస్‌ బయోఫార్మా పేర్కొంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి టీకా సరఫరా ప్రారంభించాల్సి ఉంది. అవసరాలను బట్టి ఇంకా అధిక డోసులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టెలిస్‌ బయోఫార్మా వివరించింది. స్పుత్నిక్‌ వి టీకాను పెద్ద సంఖ్యలో సరఫరా చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కిరిల్‌ డిమిట్రివ్‌ పేర్కొన్నారు.

* భారత్‌లో తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి నేపాల్‌ జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. దీంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి ఇప్పటి వరకు మూడు దేశాల్లో అనుమతి లభించినట్లైంది. కరోనా నిరోధంపై 81 శాతం సమర్థత కనబరిచిన ఈ టీకా వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసింది. ఈ నెల ఆరంభంలో జింబాబ్వే ప్రభుత్వం సైతం కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి పచ్చజెండా ఊపింది.

* లాభమొచ్చినా.. నష్టమొచ్చినా ఇకపై కంపెనీలోని స్వతంత్ర డైరెక్టర్లతో పాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు పారితోషికం చెల్లించేలా కంపెనీల చట్టం-2013లో ప్రభుత్వం సవరణలు చేసింది. సంస్థలో కార్యనిర్వాహక పదవుల్లో ఉన్న వ్యక్తుల పారితోషికంలో ఐదో వంతు వారికి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. నష్టాల్లో ఉన్న లేదా సరిపడా లాభాల్లో లేని కంపెనీలు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, స్వతంత్ర డైరెక్టర్లకు పారితోషికం ఇవ్వడానికి అనుమతి లేదు. కేవలం వారికి సిట్టింగ్‌ ఫీజు కింద కొంత మొత్తం లభించేది. దీంతో ప్రతిభగల లేదా అనుభవం కలిగిన మానవ వనరుల్ని నియమించుకునేందుకు కంపెనీలకు ఇది ఒక అడ్డంకిగా ఉండేది.తాజా నిబంధనల ప్రకారం.. నెగెటివ్‌ ఎఫెక్టివ్‌ క్యాపిటల్‌ లేదా రూ.ఐదు కోట్ల కంటే తక్కువ ఎఫెక్టివ్‌ క్యాపిటల్‌ ఉన్న సంస్థలు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ.12 లక్షల పారితోషికం చెల్లించవచ్చు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ.60 లక్షలు చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే కంపెనీ వాటాదార్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ అహార సేవల సంస్థ జొమాటో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సెబీకి పంపాల్సిన ప్రతిపాదనల ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబరు ఆఖరు కల్లా ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని.. ఇష్యూ సైజు, తేదీ, ధరల శ్రేణి వంటి విషయాలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 650 మిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి జొమాటో నిరాకరించింది.